CUET-UG పరీక్ష నిర్వహణలో సాంకేతిక లోపం! TCS వివరణ

సియుఇటి-యుజి పరీక్ష ఉదయం షిఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా సుమారు రెండు గంటల ఆలస్యం చోటుచేసుకుంది. టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించినట్లు తెలిపారు. పరీక్ష భద్రతకు ఎలాంటి భంగం కలగలేదని, ఎన్‌టీఏతో కలిసి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

CUET-UG పరీక్ష నిర్వహణలో సాంకేతిక లోపం! TCS వివరణ
Cuet Ug Exam

Updated on: May 31, 2026 | 9:53 AM

CUET-UG పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న సాంకేతిక అంతరాయంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ, ఎండీ కె కృతివాసన్ స్పందించారు. ‘ఈ రోజు(ఆదివారం) ఉదయం నిర్వహించిన షిఫ్ట్‌లో ఒక చిన్న సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష సుమారు రెండు గంటల పాటు ఆలస్యమైనట్లు తెలిపారు.’ కృతివాసన్ విడుదల చేసిన ప్రకటనలో సమస్యను టీసీఎస్ సాంకేతిక బృందాలు వెంటనే గుర్తించి పరిష్కరించాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, పరీక్ష భద్రత లేదా పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకున్నామని, అనంతరం పరీక్షను తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఈ అంతరాయం వల్ల విద్యార్థులు ఎదుర్కొన్న అసౌకర్యానికి టీసీఎస్ తరఫున విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని సిస్టమ్‌లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)తో కలిసి పనిచేస్తూనే ఉంటామని కృతివాసన్ స్పష్టం చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో కొంతసేపు అయోమయం నెలకొన్నప్పటికీ, సాంకేతిక లోపం త్వరగా పరిష్కారమవడంతో పరీక్షా ప్రక్రియ తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తదుపరి షిఫ్ట్‌ల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us