
విధి మనుషుల జీవితాలతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. దేవుడు రాసిన స్క్రిప్ట్‌లో ఏ పాత్ర ఎప్పుడు ముగుస్తుందో అస్సలు ఊహించలేం. తాజాగా తమిళనాడు(Tamil Nadu) కన్యాకుమారి(Kanyakumari) కుత్తైకాడు పలవిలైలో హృదయ విదారక ఘటన జరిగింది. రోజూ మద్యం తాగి.. ఇంట్లో గొడవ చేసే నాన్న కోప్పడతాడేమో, కొడతాడేమో అన్న భయంతో ఓ చిన్నారి ఇంటి పెరట్లో దాక్కోగా.. పాము ఆమెను కాటేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ బాలిక కన్నుమూసింది. దీంతో ఆ చిన్నారి తల్లి గుండెలవిసేలా రోదిస్తుంది. విషయం తెలిసి గ్రామస్థులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. మంగళవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పలవిలై గ్రామంలో సురెందిన్ అనే వ్యక్తి డైలీ లేబర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య సిజిమోల్.. ముగ్గురు పిల్లలు సుశ్విన్ సిజో(12), సుజిలిన్ జో(9), సుశ్విక మోల్(4) ఉన్నారు. సురెందిన్ లిక్కర్‌కు అడిక్ట్ అయ్యాడు. డైలీ మద్యం సేవించకుండా ఇంటికి వచ్చేవాడు కాదు. పీకలదాకా మద్యం తాగి వచ్చి భార్య, పిల్లలను కొడతాడు. ఈ మంగళవారం రాత్రి కూడా ఇలాగే తాగొచ్చాడు. భార్యను కొడుతుండగా.. పిల్లలు భయంతో పరుగులు తీశారు. పెరట్లోని చెట్ల పొదల్లో దాకున్నారు. ఆపై అక్కడే నిద్రపోయారు. అయితే ఓ పాము.. సుశ్విక నిద్రలో ఉండగా కాటేసింది. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి తుదిశ్వాస విడిచింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..