
తమిళనాడులో దశాబ్దకాలంగా కొనసాగుతూ వస్తోన్న గోడ పంచాయితీకి ఎండ్ కార్డ్ పడింది. తిరుప్పూర్ జిల్లా సేవూర్ పరిధిలోని దేవేంద్రన్ నగర్ గ్రామంలో దళితుల్ని తమ కాలనీలోకి రాకుండా అగ్రవర్ణాల వారు 20 ఏళ్ల క్రితం గోడ నిర్మించారు. దీంతో దళితులు ఉద్యోగాలకు వెళ్లాలన్నా.. ఇతర పనుల కోసం బయటకు వెళ్లాలన్నా కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్లాల్సి వచ్చేది. గోడను తొలగించాలంటూ చిన్నపాటి యుద్ధమే చేశారు దళితులు. చివరకు వాళ్ల పోరాటం ఫలించి.. గోడను తొలగించేశారు.
సేవూర్ పంచాయతీ పరిధిలోని దేవేంద్రన్ నగర్ గ్రామంలో 20 ఏళ్ల క్రితం దాదాపు కిలోమీటరు మేర 5 అడుగుల ఎత్తుతో గోడను నిర్మించారు. దీంతో దేవేంద్రన్ నగర్ ప్రాంత ప్రజలు ప్రధాన రహదారిపైకి వెళ్లేందుకు సులువుగా ఉన్న పంచాయతీ రోడ్లను వినియోగించు కోలేకపోయారు.
ఉద్యోగాలకి, ఇతర పనులకు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి.
గోడను తొలగించాలంటూ దళిత సంఘాలు చిన్నపాటి యుద్ధమే చేశారు. మండలాధికారులకి, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. అధికారులు మారిపోయారే తప్ప.. దళితుల గోడు మాత్రం అలాగే ఉండిపోయింది. గోడను కూల్చాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన ప్రతీసారి.. అగ్రవర్ణాలు కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. అయినా దళితులు తమ పోరాటాన్ని ఆపలేదు.
అయితే ఎంపీ కనిమొళి జోక్యంతో అధికారులు గోడను కూల్చారు. దీంతో దళితుల పోరాటం ఫలించింది. ఇవాళ అధికారుల సమక్షంలో గోడను కూల్చేశారు. దీంతో దళితులు ఆనందం వ్యక్తం చేశారు. కుల వివక్ష నుంచి తమను విముక్తి చేశారని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు దళితులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..