Tamil Nadu bus driver: ఆర్టీసీ బస్సు వేగంతో గమ్యం వైపు పయనిస్తోంది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఈ క్రమంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ ఛాతిలో నొప్పి మొదలైంది. తనకు గుండెపోటు అని గుర్తించిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రాణాలొదిలాడు. తనకు గుండె పోటు వచ్చినా.. చాకచక్యంతో వ్యవహరించి.. 30 మంది ప్రయాణికులను కాపాడి బస్సు డ్రైవర్ హఠాన్మరణానికి గురయ్యాడు. ఈ హృదయవిదారక సంఘటన తమిళనాడు మధురైకి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. తమిళనాడు ఆర్టీసీ బస్సు అరప్యాలయం నుంచి గురువారం ఉదయం ప్రయాణికులతో కొడైకెనాల్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో బస్సును నడుపుతున్న ఆరుముగమ్ (44) కు ఉదయం 6:20 గంటలకు ఛాతీలో నొప్పి మొదలైంది. గుండెపోటు అని గ్రహించిన ఆరుముగమ్ బస్సును రోడ్డు పక్కకు ఆపి సీట్లోనే కుప్పకూలాడు.
ఆరుముగం.. అరప్యాలయం నుంచి బస్సు బయలుదేరినప్పుడు ఛాతీలో నొప్పి వస్తున్నట్లు చెప్పినట్లు కండక్టర్ భాగ్యరాజ్ తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. అంబులెన్స్ వచ్చేలోపే దురదృష్టవశాత్తు ఆరుముగం మరణించాడని అధికారులు తెలిపారు. అయితే.. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి చనిపోయిన డ్రైవర్‌కు పలువురు సంతాపం వ్యక్తంచేశారు. గత 12ఏళ్ల నుంచి ఆరుముగం తమిళనాడు ఆర్టీసీలో డ్రైవర్‌గా సేవలందిస్తున్నాడని.. తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TNSTC) అధికారులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కరిమేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: