VK Sasikala – BJP: జయ నెచ్చెలి శశికళ కాషాయ కండువా కప్పుకుంటారా.. అన్నాడీఎంకే పగ్గాల కోసమే వెయిట్ చేస్తారా.. చిన్నమ్మ అడుగులు ఎటు వైపు పడనున్నాయి.. ఇప్పుడిదే తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది రోజులుగా చిన్నమ్మ అన్నాడీఎంకేలోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ముఖ్య నేత ఎమ్మెల్యే నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. AIADMK మాజీ నేత శశికళతో చర్చలు జరుపుతున్నామని.. బీజేపీలోకి వస్తే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఐతే చిన్నమ్మ అన్నాడీఎంకేలో చేరితే ఆ పార్టీ బలపడుతుందన్నారు. మిత్రపక్షంలో ఉన్న మేము, అన్నాడీఎంకే పార్టీలు డీఎంకే సర్కార్‌ను గట్టిగా ఢీ కొడతామన్నారు. ఒకవేళ శశికళను అన్నాడీఎంకే చేర్చుకోకపోతే.. బీజేపీలో చేరినా ఆమెను ఆహ్వానించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శశికళ మా పార్టీలో చేరితో తమిళనాడులో బలమైన శక్తిగా ఎదుగుతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శశికళ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు. మరోవైపు ఏఐఏడీఎంకేలోకి తన రాకను కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించారు శశికళ. ఏఐఏడీఎంకే నాయకత్వాన్ని పార్టీ క్యాడరే నిర్ణయిస్తుందన్నారు. పార్టీకి పూర్వవైభవం తనతోనేనని..ఐక్యంగా పోరాడితే అధికారం మనదేనని కామెంట్ చేశారు. అమ్మ ఆశయ సాధన కోసం కలిసి పోరాడుదామని..మనలో మనం ధూషణలకు దిగితే ప్రత్యర్థులు బలపడతారని వ్యాఖ్యానించారు. ఐతే శశికళను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి అనుమతించేదిలేదంటున్నారు అన్నాడీఎంకే నేతలు. చిన్నమ్మ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. మరి శశికళ అడుగులు బీజేపీ వైపా..ఏఐఏడీఎంకే వైపా అన్నది తమిళనాడు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.