పార్టీని అధికారంలోకి తెచ్చిన ఉద్యమం.. ఇప్పుడు అదే ఉద్యమంతో పార్టీకి కొత్త బలం..!

తమిళనాడులో హిందీ అమలు అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా విధానం మేరకు తమిళనాడులో హిందీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. అయితే తమిళనాడులో హిందీకి అనుమతించే ప్రసక్తే లేదని అక్కడి డీఎంకే ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఓ రకంగా మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమంతో డీఎంకే రాష్ట్రంలో మరింత రాజకీయ బలం పుంజుకుంటోంది.

పార్టీని అధికారంలోకి తెచ్చిన ఉద్యమం.. ఇప్పుడు అదే ఉద్యమంతో పార్టీకి కొత్త బలం..!
Tamil Nadu CM MK Stalin

Edited By:

Updated on: Feb 25, 2025 | 6:07 PM

తమిళనాడులో ఇటీవల రచ్చ రేపుతున్న అంశం హిందీ అమలు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) మేరకు త్రిభాషా విధానానికి కట్టుబడి రాష్ట్రంలో ఖచ్చితంగా హిందీ అమలు జరగాల్సిందేనని పట్టుబడుతోంది కేంద్రం. అందుకు ఛాన్సే లేదు.. హిందీ భాషను అంగీకరించే ప్రసక్తే లేదంటోంది తమిళనాడులోని డిఎంకె సర్కార్. అయితే ఈ వ్యవహారంలో అందరూ రెండు విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఒకటి గెట్ అవుట్ నినాదం.. తమిళనాడులో రెగ్యులర్‌గా వినబడుతున్న మాట.. ఎక్కడా లేని విధంగా అక్కడే ఎందుకు ఈ మాట పదే పదే వినబడుతోంది? ఇక రెండోది.. హిందీ వ్యతిరేక ఉద్యమం.. తమిళనాడులో డిఎంకె అనే ఒక రాజకీయ పార్టీ 9 దశాబ్దాల క్రితం బలమైన పునాదులు వేసుకుంది ఈ హిందీ వ్యతిరేక ఉద్యమంతోనే.. రాజకీయంగా తమిళ గడ్డపై సత్తా చాటాలన్న ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ ఇప్పుడు ఇదే అంశంతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపించడంలో తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అది భాషాపరమైన అంశమైన సాంప్రదాయాలైనా.. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చని అంశమైతే అందుకోసం ఎంత దూరమైనా పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు నిషేధం ఉన్నా యావత్ తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి అనుమతినిచ్చేదాకా పోరాటం చేశారు. అలాంటిది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని లెక్కచేయకుండా తమపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే తాము సహించబోమని అన్ని ప్రభుత్వాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.. తాజాగా మరోసారి తమిళనాడులో హిందీ అమలు అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని పీక్స్‌కి చేర్చాయి.

భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలైంది. 1938లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి గా ఉన్న రాజగోపాలాచారి హయాంలోనే దేశ వ్యాప్తంగా హిందీ అమలును వ్యతిరేకించారు.. జస్టిస్ పార్టీ హిందీ అమలును తీవ్రంగా వ్యతిరేకించింది. 1960లో ద్రవిడ కళగం అనే పార్టీ నుంచి విడిపోయి ద్రవిడ మున్నేట్ర కళగంగా ఏర్పడ్డ డిఎంకె అప్పటినుంచి హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంది. 1968లో డిఎంకె మాత్రం హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పీక్స్ కు తీసుకెళ్లింది… ద్రవిడ పార్టీలన్ని కూడా అప్పట్లో డిఎంకె కు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ పోరాటం అప్పట్లో డీఎంకేకి అధికారాన్ని తెచ్చి పెట్టింది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమానికి ఉన్న బలం ఏ పాటిదో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆ తర్వాత కూడా తమిళ రాష్ట్రంలో హిందీ భాష అమలుు వ్యతిరేకిస్తూ పోరాటాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి.. అప్పట్లోనే 80 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత వచ్చిన ఏడీఎంకే ప్రభుత్వం కూడా తమిళుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సెంటిమెంట్ అంశంగా భావించి హిందీని వ్యతిరేకిస్తూనే వచ్చింది.

ఇటీవల కొద్ది కొద్దిగా తమిళనాడులో హిందీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రైల్వేస్టేషన్లో బోర్డుల్లో తమిళం ఇంగ్లీషు అక్షరాలు మాత్రమే ఉండేవి.. మూడేళ్ల క్రితం నుంచి రైల్వే స్టేషన్లో హిందీ అక్షరాల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వాటిని వ్యతిరేకించేవారు తొలగించినప్పటికీ మిగిలిన చోట్ల హిందీ బోర్డులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నైలో ఉన్న ఎల్ఐసి కార్యాలయం.. ఎల్ఐసి వెబ్సైట్లో ఆంగ్లం, తమిళం ఆప్షన్ తొలగించి హిందీ మాత్రమే ఉంచడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. దశాబ్దాలుగా హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న మాపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం పదేపదే ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆరోపించారు. ప్రాంతీయ భాషల్ని తొలగించడమే కాకుండా ఇంగ్లీష్ ఎంచుకున్నా కూడా హిందీ భాషలోనే సమాచారం ఉంచడం సరైనది కాదన్నారు. ఇది భారతదేశ వైవిధ్యాన్ని తుంగలో తొక్కి బలవంతంగా హిందీ భాషని మాపై వృద్ధి ప్రయోగమే తప్ప మరొకటి కాదని స్టాలిన్ ఆక్షేపించారు. ఎల్ఐసి భారతీయులందరికీ ప్రోత్సాహంతో అభివృద్ధి చెందుతున్నప్పుడు మెజారిటీ ఖాతాదారులకు ద్రోహం చేసే అధికారం మీకు ఎక్కడిదని ప్రశ్నించారు.

హిందీ అమలు చేయకపోతే కేంద్రం నుంచి విద్యా అభివృద్ధి కోసం వచ్చే నిధులు ఇవ్వలేమని అధికారికంగా కేంద్రం నుంచి ప్రకటన రావడం అనేది తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రేపింది. డీఎంకే హిందీ వ్యతిరేక అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఒకింత సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఎలాగైనా తమిళనాడులో పాగా వేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న బిజెపికి ప్రస్తుతం హిందీ అమలు పేరుతో జరుగుతున్న రాద్ధాంతం నష్టాన్ని మిగుల్చుతుంది తప్ప ఉపయోగపడే అంశం ఇందులో ఏ మాత్రం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ముందు నుంచి తమిళనాడులో డీఎంకే బలపడడానికి బాగా కలిసి వచ్చిన అంశం హిందీ వ్యతిరేక పోరాటం. ఇప్పుడు ఇదే అంశం డీఎంకేకి మరోసారి కలిసొచ్చే అంశంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది.

ఇక రెండోది.. గెట్ అవుట్ నినాదం.. మామూలుగా మనం గెట్ అవుట్ అనే పదం ఎక్కువగా సినిమాల్లో వింటాం లేదా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి ఇలా గెట్ అవుట్ అనడం వింటుంటాం. అయితే తమిళనాడులో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ తరచూ ఈ పదాన్ని వాడుతున్నారు.. పొలిటికల్ గా ఇప్పుడు ఏదో ట్రెండింగ్ స్లోగన్ గా మారిపోయింది. తమిళనాడు గవర్నర్ రవి.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తమిళుల మనోభావాలను గౌరవించడం లేదంటూ డిఎంకె ప్రభుత్వం నేరుగా ఆయన్ను టార్గెట్ చేసింది.. గవర్నర్ వర్సెస్ డీఎంకే ఎపిసోడ్లో తమిళ సంఘాలన్నీ కూడా డీఎంకే వైపే నిలిచాయి. ఆ సందర్భంలో తమిళనాడు వ్యాప్తంగా గెట్ అవుట్ రవి అంటూ గవర్నర్‌పై ట్రెండింగ్ ట్రోల్స్ చేశారు.

తాజాగా ఈ గెట్ అవుట్ అనే పదం తమిళనాడులో రీ సౌండ్ చేస్తుంది. హిందీ అమలను బలవంతంగా రుద్దాలని చూస్తున్నారంటూ తాజా అంశంలో డిఎంకె గెట్ అవుట్ మోడీ అంటూ సోషల్ మీడియా వేదికగా హాష్ టాక్‌ను ట్రెండ్ చేసింది. డీఎంకేకి కౌంటర్‌గా బిజెపి స్టేట్ చీఫ్ అన్నామలై గెట్ అవుట్ స్టాలిన్ అనే స్లోగన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో రెండు పార్టీల మధ్య పోటీపోటీగా గెట్ అవుట్ అనే పదం వైరల్ గా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదే ఉండగా.. హిందీ వ్యతిరేక పోరాటం పేరుతో డీఎంకే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో డీఎంకే ఉంది. బిజెపి కూడా భాష విధానం పేరుతో డిఎంకె చేస్తున్నది రాజకీయం తప్ప కేంద్రానికి ఎలాంటి కక్ష లేదంటూ ప్రజల్లో డీఎంకేని విలన్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనేది చూడాల్సి ఉంది..