షాజహాన్ తాజ్‌మహల్ కట్టాడనడానికి సరైన సైంటిఫిక్ ఆధారాలు లేవని, చరిత్రను వెలికి తియ్యడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. తాజ్‌మహల్ చుట్టూ అల్లుకున్న కట్టుకథలకు చెక్ పెడుతూ.. అసలు చరిత్ర వెలికి తీయడానికి నిజనిర్ధారణ ప్యానెల్ ఏర్పాటు చేయాలని కోరుతూ డాక్టర్ రజనీష్ సింగ్ అనే వ్యక్తి శుక్రవారం (సెప్టెంబర్ 30) అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం 1631 నుంచి 1653 మధ్య కాలంలో 22 ఏళ్లపాటు నిర్మించాడని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్ రజనీష్ సింగ్ న్యాయవాది సమీర్ శ్రీవాస్తవ ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
పిటిషన్ ద్వారా ఆర్టీఐ దాఖలు చేసిన తర్వాత ఎన్సీఈఆర్టీ ఓ నివేదికను సింగ్‌కు జారీ చేసింది. తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించాడని చెప్పడానికి ఎటువంటి ప్రైమరీ సోర్స్ అందుబాటులో లేవని సదరు నివేదిక సారాంశం. తాజ్ మహల్ నిర్మాణ కర్తలు ఎవరనే విషయాన్ని న్యాయ పరంగా పరిష్కరించలేమని అలహాబాద్ హైకోర్టు మే 12న రజనీష్ సింగ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తర్వాత అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అల్హాబాద్ హైకోర్టు సూచనల మేరకు తాజ్ మహల్‌లో మూసివేయబడి ఉన్న 22 గదులను తెరిచి, తనిఖీ చేసేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.