Supreme Court: SIRకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈసీకి భారీ ఊరట లభించినట్లే..
సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెల్లడించింది. SIR చేపట్టేందుకు ఈసీకి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. ఆర్టికల్ 324 ప్రకారం ECకి పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది.

ఓటరు జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఆర్టికల్ 324 ప్రకారం ECకి పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో దీనిపై సుదీర్ఘ విచారణ జరగ్గా.. అనంతరం ఈ తీర్పు వెలువరించింది. దీంతో ఈసీకి ఊరట కలిగినట్లయింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అనేక రాష్ట్రాలు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీనిపై సుప్రీం విచారణ చేపట్టింది.
ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఏ చట్టాన్ని లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. SIR అనేది కచ్చితమైన, సమగ్రమైన ఓటర్ల జాబితా దిశగా ఒక ముందడుగు అని, రాజ్యాంగానికి జీవం పోస్తుందని వ్యాఖ్యానించింది. SIRను వినియోగించడం ద్వారా ఎన్నికల సంఘం తన చట్టబద్ధమైన అధికారాలకు వెలుపల వ్యవహరించలేదని తెలిపింది. సాధారణంగా నిర్వహించే దానికి భిన్నంగా ఉన్నందున దీనిని అధికారాలకు అతీతమైనది అని చెప్పలేమంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఎస్ఐఆర్ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యానికి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలనే రాజ్యాంగ లక్ష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని తాము కూడా సంతృప్తిగా ఉన్నామంది. సుప్రీంకోర్టు ఈ తీర్పుతో ఎస్ఐఆర్ చుట్టూ గత ఏడాదిగా సాగుతున్న వివాదానికి ముగింపు పలికింది.
