తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఆమె నామినేషన్ తిరస్కరిచడాన్ని సవాల్ చేస్తే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. తెలంగాణలో ఆమెపై నమోదైన కేసు వివరాలను వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..
Supreme Court Dismisses Meenakshi Natarajan Petition

Updated on: Jun 12, 2026 | 1:50 PM

సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఆర్వో తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె ఎలక్షన్ పిటిషన్ ద్వారా న్యాయపోరాటం చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

అసలు వివాదం ఏంటీ?

కాంగ్రెస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి.. హైదరాబాద్ కోర్టులో తనపై ఉన్న ఒక ప్రైవేట్ కేసు వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదని, నిజాలను దాచారంటూ బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఒక కాంగ్రెస్ నేతపై వచ్చిన వేధింపుల ఫిర్యాదుపై.. ఇంచార్జ్ మీనాక్షి తగిన చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, అందులో మీనాక్షికి నోటీసులు వచ్చాయి. ఈ వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనకపోవడం నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంటూ రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.

సుప్రీం కోర్టులో హోరాహోరీ వాదనలు

ఆర్వో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ కోరారు. “కేవలం ఒక ప్రైవేట్ కంప్లైంట్‌లో కోర్టు నోటీసు మాత్రమే ఇచ్చింది. ఆ కేసును కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు, చార్జ్‌షీట్ కూడా దాఖలు కాలేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉండి, కోర్టు చార్జ్ ఫ్రేమ్ చేస్తేనే అఫిడవిట్‌లో చెప్పాలి. కాబట్టి ఆర్వో నిర్ణయం పూర్తిగా ఏకపక్షం” అని సింఘ్వి వాదించారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం ఎన్నికల ప్రక్రియ మధ్యలో కోర్టులు జోక్యం చేసుకోలేవని, ఫలితాల తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేయడమే ఏకైక మార్గమని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల నిరసన

ఈ క్రమంలో బీజేపీపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ కావాలనే కుట్రపూరితంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి తమ అభ్యర్థి నామినేషన్‌ను రద్దు చేయించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలో భారీ నిరసనకు దిగాయి. మరోవైపు మీనాక్షి నామినేషన్ రద్దు కావడంతో మధ్యప్రదేశ్‌లో మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

Follow Us