Supreme Court on Government: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే 3.14 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయిజ అత్యధిక కేసులతో బాధాకరంగా ప్రపంచ రికార్డు సృష్టించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతమవుతుండటంతో, కోవిడ్ నియంత్రణ అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్, ముఖ్యమైన మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానంపై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
దేశంలోని ఆరు హైకోర్టుల్లో కోవిడ్ 19 మహమ్మారి సంబంధిత కేసులు విచారణలో ఉన్నాయి. ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో పడకలు, యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టులు విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సమస్యపై స్వీయ విచారణ జరపాలనుకుంటున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే గురువారం తెలిపారు. వీటి పరిష్కారానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని తెలిపారు. కోవిడ్ మహమ్మారికి మందులు అందుబాటులో లేని సమయంలో చోద్యం చూడటం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, విధానంపై జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాక్‌డౌన్‌ను ప్రకటించే అధికారం రాష్ట్రాలకే ఉందని తెలిపారు.
ముఖ్యంగా ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్య ప్రదేశ్, కలకత్తా, అలహాబాద్ హైకోర్టుల్లో కోవిడ్ 19 మహమ్మారి సంబంధిత సమస్యలపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ హైకోర్టులు ప్రజా ప్రయోజనాల కోసం తమ అధికార పరిధిని సరైన విధంగా వినియోగిస్తున్నాయని సీజేఐ జస్టిస్ బాబ్డే అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నదంతా గందరగోళంగా, అయోమయంగా ఉందన్నారు. వనరుల దారి మళ్లింపు జరుగుతోందన్నారు. ఈ సమస్యలపై కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు అమికస్ క్యూరీగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ను నియమించారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సీజే బాబ్డే ధర్మాసంన పేర్కొంది.