Isha Foundation: ఇషా ఫౌండేషన్‌పై TNPCB దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు!

తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (TNPCB) ఇషా ఫౌండేషన్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. భవిష్యత్తు నిర్మాణాలకు చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

Isha Foundation: ఇషా ఫౌండేషన్‌పై TNPCB దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు!
Isha Foundation Supreme Cou

Edited By: SN Pasha

Updated on: Feb 28, 2025 | 2:17 PM

ఇషా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోయంబత్తూరులో సద్గురు ఇషా యోగా, ధ్యాన కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం(ఫిబ్రవరి 28) ఆదేశించింది. 2006, 2014 మధ్య కాలంలో కోయంబత్తూరులోని వెల్లియంగిరి కొండలలో పర్యావరణ అనుమతి పొందకుండా నిర్మాణ పనులు చేపట్టినందుకు సద్గురు ఇషా ఫౌండేషన్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసును రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. వాటిని సవాలు చేస్తూ తమిళనాడు కాల్యుష్య నియంత్రణ మండలి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది .

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కె. సింగ్ లతో కూడిన ధర్మాసనం హైకోర్టు అభిప్రాయాన్ని సమర్ధించింది. టీఎన్పీసీబీ సవాలును తోసిపుచ్చింది. గత విచారణలో 2 సంవత్సరాల తర్వాత TNPCB ఈ ఉత్తర్వును ఎందుకు సవాలు చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. యోగా సెంటర్ ఒక విద్యా కేంద్రంగా మినహాయింపుకు అర్హమైనదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈరోజు, అప్పీలును కొట్టివేస్తూ, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి ప్రస్తుత కేసును ఒక ఉదాహరణగా పరిగణించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో చేపట్టే ఏవైనా నిర్మాణాలకు, ఈశా ఫౌండేషన్ చట్ట ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు విచారణకు టీఎన్‌పీసీబీ తరపున తమిళనాడు అడ్వకేట్ జనరల్ పిఎస్ రామన్, ఇషా ఫౌండేషన్ తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.