అయోధ్య కేసులో తీర్పును సవాల్ చేస్తూ నమోదైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుకు సంబంధించి మొత్తం 18 రివ్యూ పిటిషన్లు దాఖలు కాగా.. వాటిని విచారించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. సాధారణ ప్రొసీజర్‌ను కాదని.. విచారణను జడ్జీల ఛాంబర్‌లో నిర్వహించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, నిర్మోహి ఆకారాతో పాటు పలు సంస్థలు, వ్యక్తులు ఈ రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు.
శాంతినే తాము కాంక్షిస్తున్నామని.. అయితే అదే సమయంలో న్యాయం జరగాలని కోరుతున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా, ముస్లింలు సమర్పించిన ఆధారాల కన్నా.. హిందూ సంఘాలు బలమైన సాక్ష్యాధారాలను చూపగలిగాయని గతంలో తాము ఇచ్చిన తీర్పునే ఈ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ కూడా స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ వీటిపై విచారణ జరిపింది. కాగా, గతంలో అయోధ్య కేసు తీర్పును సమీక్షించాలని కోరుతూ 18 రివ్యూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.