హర్మూజ్‌లో చమురు ట్యాంకర్‌పై దాడి.. ఆ ఐదుగురు భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలింపు!

హర్మూజ్‌ జలసంధిలో కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై ప్రాజెక్టైల్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న ఐదుగురు భారతీయ నావికులను భారత రాయబార కార్యాలయం సమన్వయంతో సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. గల్ఫ్‌ ప్రాంతంలో భారతీయ నావికుల భద్రతపై భారత్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది..

హర్మూజ్‌లో చమురు ట్యాంకర్‌పై దాడి.. ఆ ఐదుగురు భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలింపు!
Projectile Strikes Tanker In Strait Of Hormuz

Updated on: Oct 03, 2026 | 10:22 AM

మస్కట్, అక్టోబర్ 3: హర్మూజ్‌ జలసంధిలో కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై ప్రాజెక్టైల్‌ దాడి జరిగిన ఘటనలో ఐదుగురు భారతీయ నావికులు సురక్షితంగా బయటపడ్డారు. ట్యాంకర్‌లో ఉన్న ఐదుగురినీ ఒడ్డుకు తరలించినట్లు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. MT Kazimah III అనే కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌పై హర్మూజ్‌ ప్రాంతంలో ప్రాజెక్టైల్‌ తాకింది. ఈ ఘటన అనంతరం ట్యాంకర్‌లో ఉన్న ఐదుగురు భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించేందుకు భారత మిషన్‌ సమన్వయం చేసిందని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ‘ఈ రోజు కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న MT Kazimah IIIపై ప్రాజెక్టైల్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న ఐదుగురు భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించాం. సహాయక చర్యల్లో నిరంతర సహకారం అందించిన ఒమన్‌ అధికారులకు కృతజ్ఞతలు’ అని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ నౌక కువైట్‌ జెండాతో ప్రయాణిస్తుండగా, టోగోలోని లోమే పోర్ట్‌ వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఘటన నేపథ్యంలో గల్ఫ్‌ ప్రాంతంలో వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతపై భారత్‌ ప్రత్యేక దృష్టి సారించింది.

గల్ఫ్‌లో 4,500 మందికి పైగా భారతీయ నావికులు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఇటీవల మాట్లాడుతూ.. పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో వివిధ వాణిజ్య నౌకల్లో 4,500 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నారని తెలిపారు. భారత్‌కు సంబంధించిన ఆరు జెండా నౌకలతో పాటు, భారత్‌కు సరుకులు తీసుకువస్తున్న మరో ఆరు విదేశీ జెండా నౌకలు ప్రస్తుతం గల్ఫ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ 12 నౌకల్లో సుమారు 163 మంది భారతీయ నావికులు ఉన్నట్లు వెల్లడించారు. భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ, భారత దౌత్య కార్యాలయాలు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ నౌకల కదలికలను, నావికుల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు జైస్వాల్‌ తెలిపారు. ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌, రెడ్‌ సీ నుంచి బ్లాక్‌ సీ వరకు వాణిజ్య నౌకలు, నావికులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య నౌకలు, నావికుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండకూడదని, అంతర్జాతీయ చట్టాలను కచ్చితంగా పాటించాలని జైశంకర్‌ స్పష్టం చేశారు. గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి, తక్షణమే సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. హర్మూజ్‌ జలసంధి ప్రపంచంలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో ఒకటి కావడంతో, అక్కడ చోటుచేసుకునే భద్రతా ఘటనలు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us