
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో సాధ్యమైనంతవరకు కలిసికట్టుగా పోరాడతామని ఆ కూటమి ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలోనే విపక్ష కూటమికి ఉప ఎన్నికల రూపంలో మొదటి పరీక్ష ఎదురుకానుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ అనే అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 5 తేదీన ఉప ఎన్నిక జరగనుంది. అయితే బీజేపీ.. ఇండియా కూటమి నేరుగా పోటీ పడుతున్న మొదటి ఎన్నిక కూడా ఇదే. దీంతో ఈ అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలుస్తారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో విషయం ఏంటంటే ఘోసి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా గెలిచినటువంటి దరా సింగ్ చౌహన్ ఇటీవలే పార్టీ మారారు. అయితే ఆయన సమాజ్‌వాద్ పార్టీని వీడి.. బీజేపీలో చేరాడు. దీంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేశారు.
అందుకే ఇక్కడ ఉపఎన్నికల అనివార్యమైపోయింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున దరా సింగ్ చౌహన్ పోటీలోకి దిగిపోయాడు. అయితే ఈ దరా సింగ్ చౌహన్‌ను ఎదుర్కోవడానికి సమాజ్‌వాది పార్టీ సుధాకర్ సింగ్‌ను బరిలోకి దించింది. మరో విషయం ఏంటంటే విపక్ష కూటమి అయిన ఇండియాలో సమాజ్‌వాదీ పార్టీ కూడా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఘోసీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అయిన సుధాకర్ సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఆప్, ఆర్‌ఎల్‌డీ సహా పలు పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించేశాయి. మరోవైపు అటు బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నిక పోరుకు అభ్యర్థిని నిలబెట్టకుండా దూరంగా ఉంది. దీంతో ఈ ఎన్నిక బీజీపీ, ఇండియా కూటమిల మధ్య ద్విముఖ పోరుగా మారిపోయింది. అయితే ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మొత్తం 10 మంది పోటీలో ఉన్నారు.
కానీ ఈ ఉపఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆ ఘోసి నియోజకవర్గంలో 4 లక్షల 38 వేల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. అయితే మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో ఆరోజున ఎవరు గెలవనున్నారో తెలనుంది. మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అధికార బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. అయితే ఈ ఒక్క ఉప ఎన్నిక వల్ల ప్రభుత్వంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జట్టు కట్టినటువంటి విపక్షాలకు ఇది ముఖ్యమైన పరీక్షే. అయితే ఈ ఎన్నిక ఫలితాలు.. లోక్‌సభ ఎన్నికలపై కూడా ప్రభావాన్ని చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..