యూపీలోని హత్రాస్ లో అత్యాచార బాధితురాలి తండ్రిని దుండగులు కాల్చి చంపిన ఘటన దేశంలో సంచలనం రేపింది. 2018 లో తనపై గౌరవ్ శర్మ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనపై కక్ష గట్టి తన తండ్రిని శర్మ, అతని స్నేహితులు కాల్చి చంపారని బాధితురాలు ఆరోపించిన సంగతి విదితమే. పోలీసులు గౌరవ్ శర్మను అరెస్టు చేసి ఆ తరువాత బెయిలుపై విడుదల చేశారు. ఇటీవల వీరు బాధితురాలి తండ్రితో గొడవ పడి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆ తరువాత ఆసుపత్రిలో మరణించాడు. కాగా సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటనలో మీ పార్టీకి చెందిన ఓ వ్యక్తి ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయని, ఇది నిజమేనా అని ఆ జర్నలిస్టు ప్రశ్నించగా.. నువ్వు అమ్ముడు పోయావని, నువ్వు ఏ ఛానల్ లో పని చేస్తున్నావని అఖిలేష్ అతడ్ని ప్రశ్నించారు. ఆ ఛానల్ పేరేమిటని కూడా ఆయన అన్నారు. దీంతో తన ప్రశ్నకు జవాబు లభించక ఆ రిపోర్టర్ కూర్చుండిపోయాడు.
హత్రాస్ లోని నౌజార్ పూర్ అనే గ్రామంలో మూడేళ్ళ క్రితం ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై కేసు దాఖలు చేశారు. ఒకరిని అరెస్టు చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వారికోసం ఖాకీలు గాలిస్తున్నారు. లోగడ కూడా హత్రాస్ లో జరిగిన ఓ సంఘటన పెను సంచలనాన్ని సృష్టించింది. ఓ యువతి పై గ్యాంగ్ రేప్ జరగడం, ఆ తరువాత ఆ యువతి మృతి చెందిన విషయం తెలిసిందే.
Read More :