ప్రధాని మోదీని పొగిడిన వైనం, గులాం నబీ ఆజాద్ ని అపార్థం చేసుకున్నారన్న సన్నిహిత వర్గం
ప్రధాని మోదీ పై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశంసలు కురిపించినట్టు వచ్చిన వార్తలు పార్టీలో దుమారం రేపాయి. నిజానికి ఆయన మోదీని పొగడలేదని, ఆయన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ఆజాద్ సన్నిహితవర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ పై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశంసలు కురిపించినట్టు వచ్చిన వార్తలు పార్టీలో దుమారం రేపాయి. నిజానికి ఆయన మోదీని పొగడలేదని, ఆయన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ఆజాద్ సన్నిహితవర్గాలు తెలిపాయి. దీనిపై ఆయన తగిన సమయంలో వివరణ ఇస్తారని వెల్లడించాయి. ఇటీవల జమ్మూలో జరిగిన కార్యక్రమంలో ఆజాద్ ఇలా ప్రధానిని కొనియాడారని సమాచారం. అయితే అనేకమంది నాయకులనుంచి తాను ఎన్నో నేర్చుకుంటూ ఉంటానని, తానొక గ్రామానికి చెందినవాడినని, ఇందుకు గర్విస్తున్నానని ఆయన వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. మన ప్రధానమంత్రి కూడా ఓ గ్రామానికి చెందినవారని, ఆయన టీ అమ్మేవారని, తాము రాజకీయ ప్రత్యర్థులమైనా తన మునుపటి జీవితాన్ని ఆయన (ప్రధాని) దాచలేదని ఆజాద్ పేర్కొన్నారని ఆయన సన్నిహిత వర్గాలు వివరించాయి. ఇంతే తప్ప మోదీ ని ఆయన పొగడలేదని ఈ వర్గాలు చెప్పాయి. రాజ్యసభ నుంచి ఆజాద్ రిటైరైన సందర్భంలో పార్లమెంటులో ఆయనను ప్రశంసిస్తూ మోదీ భావోద్వేగంతో కంట తడి పెట్టిన విషయం గమనార్హం.
ఎన్నికల కమిషన్ కు పంపాల్సిన పార్టీ క్యాంపెయినర్ల లిస్టును రూపొందించడంలో ఆజాద్ బిజీగా ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఆయన వివరణ ఇవ్వలేకపోతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. అందువల్లే తగిన సమయంలో అన్ని అంశాలూ వివరంగా చెబుతారని వారు చెప్పారు. అటు-అస్సాం పర్యటనలో ఉన్న పార్టీ నేత ప్రియాంక గాంధీ, ఈ అంశంపై గానీ, పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మకు, మరో నేత అధిర్ రంజన్ చౌదరికి మధ్య తలెత్తిన విభేదాల గురించి గానీ మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రస్తుతం తాను ప్రచార కార్యక్రమంలో ఉన్నానని, ఢిల్లీకి వెళ్లిన అనంతరం సమాచారం తెలుసుకుంటామని ఆమె చెప్పారు. ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి బాహాటంగా లేఖ రాసిన 23 గ్రూప్ లో ఆజాద్ కూడా ఉన్న నేపథ్యంలో ఆయనపై తాజాగా ‘నీలినీడలు’ కమ్ముకుంటున్నాయా అన్న సందేహాలు తలెత్తాయని అంటున్నారు.
Read More :
మేం అధికారంలోకి వస్తే, మహిళలకు నెలకు 2 వేల సాయం, అస్సాంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వరాల వెల్లువ