
హైదరాబాద్, మే 25: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతకు శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 మంది, ఉమ్మడి కరీంనగర్‌లో 11 మంది, ఖమ్మంలో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఐదుగురు, నల్లగొండలో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గత మూడు రోజుల్లో ఏకంగా 107 మంది వడదెబ్బతో చనిపోయారు. నేటి నుంచి రోహిణీ కార్తి మొదలైన నేపథ్యంలో వచ్చే 3 రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు తీవ్రం కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తోడవనున్నాయి. మే 27 వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉండనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
మరోవైపు భారత వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుని మరో రెండు రోజుల్లో కేరళను తాకనున్నట్లు పేర్కొంది. మే 26న కేరళలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఈ వారంతం నాటికి తెలంగాణతోపాటు జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ, గోవా రాష్ర్టాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
మే 26 నుంచి 29 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా కృష్ణలో అత్యధికంగా 5.45 సెం.మీ వర్షపాతం నమోదైంది. జోగుళాంబ గద్వాల, అలంపూర్, వనపర్తి జిల్లా చిన్నంబావి, ఆత్మకూరు, వనపర్తి, మద్నూర్, పెద్దమామిడి, అమరచింతలో మోస్తరు వర్షాలు కురిశాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.