
Southern Travels: భారతదేశంలోని అగ్రశ్రేణి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్ స్వర్ణోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగాయి. లలిత్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ సంస్థ నూతన లోగోను ఆయన ఆవిష్కరించారు. ఇకపోతే, సదరన్ ట్రావెల్స్ ద్వారా కాశీ యాత్ర చేసే ప్రయాణికుల సౌకర్యార్థం కాశీ విశ్వనాథుని ఆలయం ప్రాంగణంలో 18 రూమ్‌లు, 36 డార్మిటరీ బెడ్లు ప్రత్యేకంగా కేటాయించిన విషయాన్ని సంస్థ ప్రకటించింది. ఈ అరుదైన ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి కంపెనీ సదరన్ ట్రావెల్స్ కావడం విశేషం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో ట్రావెలింగ్, టూరిజం రంగాలు అద్భుతంగా అభివృద్ధి సాధించడంలో సదరన్ ట్రావెల్స్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని అభినందించారు. 5 దశాబ్ధాలుగా ట్రావెలింగ్, టూరిజం రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తూ, భారత ప్రభుత్వంచే ఎనిమిదిసార్లు బెస్ట్ డొమెస్టిక్ ఆపరేటర్ అవార్డును సొంతం చేసుకుందని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా, ప్రతిష్టకమైన డబ్ల్యూటీఎం, ఐటిబి బెర్లిన్, ఐసిసిఏ, ఏటీఎం, తానా వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో మన భారతదేశానికి ప్రాతినిథ్యం వహించే అరుదైన ఘనత సదరన్ ట్రావెల్స్ సొంతమని ఆయన కొనియాడారు. దేశ వ్యాప్తంగా ప్రయాణికులకు వ్యక్తిగత, ఇన్సెంటివ్ సెలవులకు, ప్రత్యేక ఆసక్తితో కూడిన టూర్లకు, వీసాలు, హోటల్ బుకింగ్ సదుపాయాలను సంస్థ అందిస్తోందని ఆయన వివరించారు.
ఇక సంస్థ చైర్మన్ ఆలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 1970లో ప్రారంభించిన తమ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి.. భారత ప్రభుత్వం చే నెంబర్ 1 డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ అవార్డును అందుకుందని పేర్కొన్నారు. సంస్థను ప్రారంభించిన అనతికాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుందన్నారు. కస్టమర్ల సదుపాయం, ఆహ్లాదాలే లక్ష్యంగా దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రానికి, పర్యాటక స్థలానికి ప్యాకేజీ టూర్లను నిర్వహిస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు. కస్టమర్ల ఆదరణ, ఆశీర్వాదంతోనే నేడు 50 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన సేవలు అందిస్తామని, పురోగమిస్తామని పేర్కొన్నారు.