Coal Shortage: పంజాబ్‌లో బొగ్గు కొరత.. తగ్గిపోయిన విద్యుత్ ఉత్పత్తి.. సరఫరా పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి
ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. బొగ్గు కొరత కారణంగా పంజాబ్‌లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. బొగ్గు కొరతతో మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది...
ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. బొగ్గు కొరత కారణంగా పంజాబ్‌లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. బొగ్గు కొరతతో మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. తమ రాష్ట్రానికి బొగ్గు సరఫరా పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేంద్రాన్ని అభ్యర్థించారు. రాష్ట్రంలో 5,620 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నా ప్రస్తుతం 2,800 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు కొరత ఫలితంగా పంజాబ్‌లోని లెహ్రా మొహబ్బత్, రోపర్ (రూప్‌నగర్), రాజ్‌పురా, తల్వాండి సాబో, గోయింద్వాల్ సాహిబ్‌తో సహా థర్మల్ పవర్ ప్లాంట్లు మరో నాలుగు రోజులు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయగలవని చెప్పారు. పంజాబ్‌లో ఇప్పటికే ఐదు థర్మల్ పవర్ ప్లాంట్‌లు మూసివేశారు. బొగ్గు కొరత కారణంగా రోపర్‌లో రెండు, తల్వంతి సాబోలో రెండు, లెహ్రా మొహబ్బత్‌లో ఒకటి మూసివేశారు.
ఉత్పత్తి తగ్గటంతో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) ప్రైవేట్ సంస్థలు, పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని పీఎస్‌పీసీఎల్ ఛైర్మన్ ఎ వేణు ప్రసాద్ తెలిపారు. బొగ్గు కొరత కారణంగా పీఎస్‌పీసీఎల్ మూడు నుండి ఆరు గంటల వరకు విద్యుత్ కోతలను విధిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 300 నుంచి 400 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నాయి. చరణ్‌జిత్ సింగ్ చాన్నీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం సొంత నేతల నుండి విమర్శలను ఎదుర్కొంటోంది.
“30 రోజుల వరకు బొగ్గు నిల్వలు ఉంచకుండా దేశీయ వినియోగదారులను శిక్షిస్తున్నారని.. దీనికి ప్రభుత్వం పశ్చాత్తాపం పడలన్నారు. సోలార్ పీపీఎలు, రూఫ్-టాప్ సోలార్‌పై దూకుడుగా పని చేయాల్సిన సమయం వచ్చిందని” అని కాంగ్రెస్ పార్టీ నేత చెందిన నవజ్యోత్ సింగ్ సిద్ధు ట్విట్టర్‌లో అన్నారు.
ప్రస్తుత విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్రాని బొగ్గు సరఫరాను వెంటనే పెంచాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేంద్రాన్ని కోరారు. పంజాబ్‌లోని బొగ్గు నిల్వలు కొన్ని రోజుల్లో అయిపోతాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చన్నీ.. థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు లేని కారణంగా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. నగరాలు, గ్రామాల్లో గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, వ్యవసాయ రంగానికి కోతలు విధించాల్సి వస్తుందన్నారు.