శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఈ పేరు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. మూడు దశాబ్దాల రాజకీయ జీవితం.. 13 ఏండ్లకే ఆర్ఎస్ఎస్‌లోకి ఎంట్రీ. అనంతరం ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో మరోసారి విజయఢంకా మోగించి.. ఐదోసారి సీఎం పదవిని చేపట్టాలని ఉవ్విళ్లురుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చౌహాన్.. తిరుగులేని నేతగా ఎదిగారు. నాలుగుసార్లు సీఎం పదవిని చేపట్టడం అంతా అషామాషీ విషయం కాదనే చెప్పాలి. ఇదిలావుంటే.. శివరాజ్‌సింగ్ చౌహాన్ సెహూర్ జిల్లాలోని జైట్ గ్రామంలో ప్రేమ్ సింగ్ చౌహాన్, సుందర్ బాయి చౌహాన్ దంపతులకు మార్చి 5, 1959న జన్మించారు. భోపాల్‌లోని మోడల్ హయ్యర్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం ఇదే భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేశారు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ తన 13 సంవత్సరాల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. దానికి అనుబంధంగా విద్యార్థి విభాగమైన ఏబీవీపీలో పలు హోదాల్లో విద్యార్థి నేతగా సేవలందించారు.
అనంతరం 1990లో బుద్ని నియోజకవర్గం నుంచి తొలిసారిగా శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికలయ్యారు. అదే సంవత్సరం విదిశ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలా శివరాజ్ సింగ్ బీజేపీలో క్రియాశీలక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం 2005లో తొలిసారిగా బీజేపీ తరపున శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలా వరుసగా మూడుసార్లు సీఎం పీఠాన్ని శివరాజ్ సింగ్ అధిష్టించారు. అయితే 2018 ఎన్నికల్లో తొలిసారిగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో అక్కడ కమలనాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పటికే సీఎం కమలనాథ్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియాకు మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏడాది తిరగకముందే జ్యోతిరాదిత్య సింథియా బీజేపీలోకి తన అనుచర ఎమ్మెల్యేలను తీసుకుని జంప్ అయ్యారు. దీంతో మరోసారి బీజేపీ నేతృత్వంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇరు పార్టీలు తిరిగి అధికారం చేజిక్కుంచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదోసారి సీఎం పీఠంపై కన్నేశారు. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేవలం జాతీయ నేతల ఇమేజ్‌పై ఆధారపడకుండా రాష్ట్రంలో సొంత ఇమేజ్‌తో శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఏదీఏమైనప్పటికీ మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదోసారి సీఎం పదవి చేపడతారా.? లేదా..? అన్నదాని కోసం వేచిచూడాల్సిందే.