మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం దక్కింది. ఐదగురు కేంద్రమంత్రులు ప్రాతినిధ్యంతో ఇరు రాష్ట్రాల అభివృద్ధికి పెద్దపీట పడుతుందని భావిస్తున్నారు. కేంద్రమంత్రి పదవుల విషయంలో బీజేపీ – తెలుగునేతలకు ఓ సెంటిమెంట్ ఆనాటి నుంచి కలిసి వస్తోంది. ఆ సీట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా గెలిస్తే, కేంద్రమంత్రి పక్కా అనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. ఇదే మరోసారి రుజువైంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన ఐదుగురు కేంద్రమంత్రుల్లో ముగ్గురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కిషన్ రెడ్డి రెండోసారి కేంద్రమంత్రి కాగా, కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచి బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. ఏపీలో ఎన్డీయే కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎంపీగా జయకేతనం ఎగురవేసి మోదీ కేబినెట్ లో చేరిపోయారు. ఈ మూడు బీజేపీ ఎంపీ స్థానాల్లో గతంలోనూ ఇక్కడి నుంచి బీజేపీ తరపున గెలిచిన వారే కేంద్రమంత్రులుగా చేసిన ఆనవాయితీ కనిపిస్తోంది.
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బండారు దత్తాత్రేయ 1999 ఎన్నికల్లో విజయం సాధించి నాటి అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2014లోనూ సికింద్రాబాద్ నుంచే ఎంపీగా గెలిచి మోదీ కేబినెట్ లో కూర్చొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచి రెండుసార్లు కేంద్రమంత్రిగా బండారు దత్తాత్రేయ బాధ్యతలు నిర్వహించారు. అదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ అయ్యింది. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే 2019, 2024 ఎన్నికల్లో గెలిచి వరసగా రెండు సార్లు కేంద్రమంత్రి అయ్యారు జి. కిషన్ రెడ్డి. సో, సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే సెంటిమెంట్ ప్రకారం సెంట్రల్ మినిస్టర్ పక్కా అని అంటున్నారు.
ఇక కరీంనగర్ నుంచి 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల్లో సీహెచ్ విద్యాసాగర్ రావు విజయం సాధించి, నాటి ఎన్డీయే కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. ఇప్పుడు అదే కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ కుమార్ మోడీ సర్కార్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగానే బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్‌లో బీజేపీ కమిట్‌మెంట్ లీడర్‌కు ఎంపీగా విజయం దక్కితే మంత్రివర్గంలో చోటు పక్కా అనే సెంటిమెంట్ మరోసారి వినిపిస్తోంది.
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ ప్లేస్ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన బీజేపీ క్యాండిడేట్స్ ను మంత్రి పదవి వరించింది. 1999 లో గెలిచిన కృష్ణంరాజు కేంద్రమంత్రి కాగా, తాజాగా గెలిచిన బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతలు గతంలో ఎంపీ స్థానాల్లో గెలిచి కేంద్ర మంత్రులు అయినే స్థానాలకే మోడదీ 3.0 కేబినెట్ లో చోటు దక్కడంతో ఆ నియోజకవర్గాలపై సెంటిమెంట్ పండిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…