Somanathan: కేబినెట్ సెక్రటరీగా సోమనాథన్.. ఆర్థిక రంగ నిపుణుడికి కీలక బాధ్యతలు

| Edited By: Narender Vaitla

Aug 10, 2024 | 8:38 PM

ఇప్పటి వరకు 1982 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబా కేబినెట్ సెక్రటరీగా పనిచేశారు. 2019లో ఈ పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత కేంద్రం మరో ఏడాదికాలం పొడిగించింది. అలా ఇంకో రెండు పర్యాయాలు పొడిగించి మొత్తంగా ఐదేళ్లపాటు ఆయన్ను కేబినెట్ సెక్రటరీగా కొనసాగించింది. 2019లో నరేంద్ర మోదీ...

Somanathan: కేబినెట్ సెక్రటరీగా సోమనాథన్.. ఆర్థిక రంగ నిపుణుడికి కీలక బాధ్యతలు
Tv Somanathan
Follow us on

దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసెస్ పదవి ఏదైనా ఉందంటే అది కేబినెట్ సెక్రటరీ పదవే. కేంద్ర ప్రభుత్వానికి కళ్లు, చెవులు, ముక్కు వంటి పంచేద్రియాలన్నీ కలగలిపితే కేబినెట్ సెక్రటరీగా చెప్పవచ్చు. అంత కీలకమైన పదవికి కేంద్ర ప్రభుత్వం 1987 బ్యాచ్ తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్ (IAS) అధికారి టీవీ సోమనాథన్‌ను ఎంపిక చేసింది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కేబినెట్ సెక్రటరీగా పనిచేసిన రాజీవ్ గౌబా స్థానంలో సోమనాథన్ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అవసరమైతే మరికొన్నాళ్లు పదవీకాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.

ఇప్పటి వరకు 1982 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబా కేబినెట్ సెక్రటరీగా పనిచేశారు. 2019లో ఈ పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత కేంద్రం మరో ఏడాదికాలం పొడిగించింది. అలా ఇంకో రెండు పర్యాయాలు పొడిగించి మొత్తంగా ఐదేళ్లపాటు ఆయన్ను కేబినెట్ సెక్రటరీగా కొనసాగించింది. 2019లో నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్ము-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం పార్లమెంటులో పాస్ చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి ఆర్కిటెక్ట్‌గా రాజీవ్ గౌబాకు పేరుంది. అంతేకాదు, ఆ తర్వాత వచ్చిన కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన చూపిన చొరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆకట్టుకుంది. అందుకే 2021, 2022, 2023లో వరుసగా గౌబా పదవీకాలాన్ని మోదీ పొడిగిస్తూ మొత్తంగా 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగేలా చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఎవరీ సోమనాథన్?

1987 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్‌కు ఆర్థిక రంగ నిపుణుడిగా పేరుంది. కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో చేసిన పీహెచ్డీ మాత్రమే కాదు, ఆయన తన సర్వీసులో నిర్వహించిన పదవులు కూడా ఆయనకు ఈ పేరు తెచ్చిపెట్టాయి. తమిళనాడు ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పనిచేసిన ఆయన, 2007 నుంచి 2010 మధ్యకాలంలో చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా పనిచేశారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగానూ సేవలు అందించారు. కేంద్ర సర్వీసుల్లో 2019 నుంచి 2021 మధ్యకాలంలో ఆర్థిక శాఖలో ఫైనాన్స్ ఎక్స్‌పెండిచర్ సెక్రటరీగా, తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2015 నుంచి 2017 మధ్యకాలంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత అదనపు కార్యదర్శిగా సేవలు అందించారు.

కార్పొరేట్ వ్యవహారాల శాఖలో స్వల్పకాలం పాటు జాయింట్ సెక్రటరీగానూ ఆయన పనిచేశారు. వాషింగ్టన్ (DC)లో ఉన్న వరల్డ్ బ్యాంక్‌లో కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్‌గా సోమనాథన్ పనిచేశారు. 1996లో యంగ్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా వరల్డ్ బ్యాంక్ ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ రీజనల్ వైస్ ప్రెసిడెన్సీలో ఫైనాన్షియల్ ఎకనమిస్ట్‌గా పనిచేారు. 2000 నాటికి ఆయన వరల్డ్ బ్యాంక్‌లో సెక్టార్ మేనేజర్లుగా ఎదిగిన అతి చిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు. వరల్డ్ బ్యాంక్ బడ్జెట్ పాలసీ గ్రూపు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2011లో ఆయన సేవలు తమకు మళ్లీ అవసరమున్నాయని వరల్డ్ బ్యాంక్ కోరడంతో ఆయన వరల్డ్ బ్యాక్ డైరెక్టర్‌గా 2015 వరకు పనిచేశారు.

కేబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన్ను తక్షణమే ఆ విభాగంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా నియమిస్తున్నట్టు కేబినెట్ నియామకాల కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 30తో రాజీవ్ గౌబా పదవీకాలం ముగుస్తోంది. అప్పటి వరకు కేబినెట్ సెక్రటరియేట్‌లో సోమనాథన్ ఓఎస్డీగా పనిచేస్తూ, గౌబా పదవీ విరమణ అనంతరం కేబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. యావత్ ప్రపంచం యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం, ఆహార సంక్షోభం వంటి పరిస్థితులతో ఆర్థిక మందగమనంలో ఉన్న సమయంలో భారత ప్రభుత్వానికి కేబినెట్ సెక్రటరీగా ఆర్థిక రంగ నిపుణుడు బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..