వజ్రాల వర్తకుడు నీరవ్ మోడీ కేసుకు సంబంధించి ఇండియాలోని కోర్టుల్లో విచారణ సరిగా జరగదని, ఇందుకు కారణం అక్కడి జుడీషియరీ అవినీతితో కూరుకుపోవడం వల్లనే అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు లండన్ కోర్టులో విచిత్రమైన వాదన వినిపించారు. ఇంతేకాదు, ఇండియాలోని దర్యాప్తు సంస్థలు అక్కడి ప్రభుత్వానికి అణగిమణగి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ మాజీ న్యాయమూర్తి సెల్ఫ్ పబ్లిసిస్ట్ (స్వయం ప్రచారకుడు) గా కనిపిస్తున్నారని, ప్రెస్ ను ప్రభావితం చేసేందుకు ఎలాంటి షాకింగ్ వ్యాఖ్యలైనా చేస్తుంటారని భారత ప్రభుత్వం తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు లాయర్ హెలెన్ మాల్కమ్ అన్నారు. నీరవ్ మోడీ భారత్ కు అప్పగింత కేసును లండన్ కోర్టు జస్టిస్ శామ్యూల్ గూజె.. ఐదో రోజున విచారించారు. మళ్ళీ కేసు విచారణను నవంబరు 3 కి వాయిదా వేశారు. నీరవ్ మోడీ మనీలాండరింగ్ కేసులో భారత అధికారులు అందజేసిన సాక్ష్యాధారాలను అంగీకరించాలా.వద్దా అన్న అంశంపై ఆ రోజున జరిగే వాద, ప్రతివాదనలను ఆలకించనున్నారు.
మార్కండేయ కట్జు వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో నీరవ్ మోడీ దోషి కాదన్నట్టుగా ఆధారాలను ఈవారంలో మీడియాకు ఇవ్వాలన్న కట్జూ నిర్ణయాన్ని మాల్కమ్ ఖండించారు. ఇది సబ్ జుడీస్ అవుతుందన్నారు. ఇంతకీ నీరవ్ మహాశయుడు తన తరఫున వాదించేందుకు ఏర్పాటు చేసుకున్న డిఫెన్స్ టీమ్ లో కట్జూ కూడా ఒకరైపోయారు. అందుకే ఆయన ఇండియాను నాజీ జర్మనీతో పోల్చుతూ.. తన ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తున్న నేపథ్యంలో ఇండియా నీరవ్ ను ‘బలిపశువు’ ను చేసిందని ఆరోపించారు.