‘విభజించి – పాలించు’.. చాలా ఏళ్ల నుంచి అమలవుతున్న ఈ విధానం.. మానవాళి ఎదుర్కుంటున్న ప్రధాన సవాళ్లకు ఎలాంటి పరిష్కారాలు అందించలేకపోయింది.సరిగ్గా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సస్మిత్ పాత్ర. లువాండాలో జరిగిన 147వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్(IPU) అసెంబ్లీలో ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కుంటున్న పెద్ద సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు సస్మిత్ పాత్ర. ప్రపంచవ్యాప్తంగా విశ్వాస లోపాన్ని అధిగమించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును పునరుద్ఘాటించారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న విషయాలు, పరిణామాలపై.. ప్రపంచ యువత అస్పష్టతతో ఉన్నారన్న అంశాన్ని కొద్దిరోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన పీ-20 ఫోరమ్‌లో భారత ప్రధాని ప్రసంగించినట్లు సస్మిత్ పాత్ర చెప్పుకొచ్చారు. విభజించుకుంటూపోతే.. ప్రపంచం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు ఎలాంటి పరిష్కారాలు దొరకవన్నారు. వ్యవస్థలను వృద్ది చేయడంతో పాటు అందరి శ్రేయస్సు కోసం ఇదే సరైన సమయం. ప్రపంచవ్యాప్తంగా విశ్వాస లోపాన్ని అధిగమించి మానవ కేంద్రీకృత ఆలోచనతో దేశాలన్నీ కూడా ముందుకు సాగాలని స్పష్టం చేశారు సస్మిత్ పాత్ర. అలాగే భారతదేశ ప్రతిపాదన తర్వాత ఆఫ్రికన్ యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వాన్ని పొందిదని కూడా ప్రస్తావించారాయన.
‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే స్ఫూర్తితో మనందరం ప్రపంచాన్ని చూడాలి. ఈ స్ఫూర్తితోనే, భారత్.. ఆఫ్రికన్ యూనియన్‌ను G20లో శాశ్వత సభ్యదేశంగా చేయాలని ప్రతిపాదించింది. దీనికి అన్ని G20 సభ్య దేశాలు కూడా ఆమోదం తెలపడం తమకు సంతోషాన్ని ఇచ్చింది. కొన్నిరోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన P20 ఫోరమ్‌లో పాన్-ఆఫ్రికా పార్లమెంట్ పాల్గొనడం చూసి మేము చాలా సంతోషించాం’ అని అన్నారు సస్మిత్ పాత్ర.
అంతకముందు పీ20 సమ్మిట్ జరిగిన సమయంలో.. ‘మిమ్మల్ని కొత్త పార్లమెంట్ భవనానికి స్పీకర్ ఓం బిర్లా తీసుకెళ్తారు. దేశం చాలా ఏళ్లుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కుంటోంది. ఉగ్రవాదులు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం పాత పార్లమెంటు సమీపంలోఉన్న బ్లాక్‌పై కూడా ఉగ్రవాదుల దాడికి గురైంది. ఆ సమయంలో అదే బ్లాక్‌లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని మోదీ తెలిపినట్టు సస్మిత్ పాత్ర చెప్పుకొచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..