Sasikala : తమిళ చిన్నమ్మ హఠాత్ నిర్ణయం, షాక్ తిన్న తంబీలు, డైలమాలో బీజేపీ, ఏఐ డీఎంకె మౌనం
తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతారనుకున్న ఏఐడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగానే తమిళ ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Sasikala In Thamilnadu Politics :తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతారనుకున్న ఏఐడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగానే తమిళ ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మళ్ళీ తన కరిష్మాతో తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేస్తారని అంతా ఊహిస్తున్న తరుణంలో ఆమె ఈ ప్రకటన చేసి సరికొత్త సస్పెన్స్ సృష్టించారు.ఈ తాజా పరిణామంపై అన్నాడీఎంకే లోలోన హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ మౌనంగా ఉంది. అటు శశికళ మేనల్లుడు, అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ పూర్తి నిరాశలో కూరుకుపోయారు. ఆమెను, తనను అన్నాడీఎంకే కీలక పదవుల నుంచి తొలగించినందుకు తాము ఆ పార్టీ నేతలపై కోర్టుకెక్కుతామని కూడా ఆయన ప్రకటించారు. కానీ చిన్నమ్మ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. రాజకీయాలకు తాను గుడ్ బై చెప్పడమే కాదు, ఏప్రిల్ 6 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించాలని, మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టాలని కూడా తాను ఆ భగవంతుడిని ప్రార్థిస్తానని శశికళ చెప్పారు. రాష్ట్రంలో ఏఐడీఎంకే అధికారంలో కొనసాగాలన్న తన స్నేహితురాలు, దివంగత సీఎం జయలలిత ఆశయం నెరవేరాలన్నదే తన కోర్కె కూడా అని ఆమె చెప్పారు.
ఎన్నికలకు ముందు ఈ పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా సమైక్యంగా ఉండాలని, అప్పుడే తిరిగి తమ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయని ఆమె భావించినట్టు తెలుస్తోంది. బెంగుళూరు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ఆమె ఇలాగె వ్యాఖ్యానించారు. జయలలితను అభిమానించేవారంతా తమిళనాడులో డీఎంకే ను ఓడించాలని ఆమె తరచూ చెబుతూ వచ్చారు. తనకు పదవీ వ్యామోహం లేదని, ఏ పోస్టునూ తాను ఆశించడంలేదని చెప్పిన శశికళ ..జయలలిత కన్న కలలను నిజం చేయాలన్నారు. అన్నాడీఎంకే నేతలపై శశికళ ఒక్క విమర్శ కూడా చేయని అంశాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. తమిళనాట అన్నాడీఎంకేతోను, దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మునేట్ర కళగం పార్టీతోనూ పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో తమ హవా కొనసాగించాలనుకున్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా చిన్నమ్మ నిర్ణయం షాకింగ్ న్యూసే ! అటు శశికళ నిర్ణయంపై స్పందించిన దినకరన్.. అన్నాడీఎంకేను సమైక్యంగా ఉంచేందుకే ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని అన్నారు. శశికళ తీసుకున్న హఠాత్ నిర్ణయం బీజేపీకి పెద్ద దెబ్బ అని, ఆమె ద్వారా…. అన్నాడీఎంకే ద్వారా తమిళనాట చక్రం తిప్పాలనుకున్న కమలనాథులు డీలా పడిపోయారని కాంగ్రెస్ నేత అళగిరి వ్యాఖ్యానించారు .
మరిన్ని చదవండి ఇక్కడ :