‘Sanatan Dharma’ remark: ఉదయ నిధి స్టాలిన్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..

‘Sanatan Dharma’ remark: 'సనాతన ధర్మ' పై చేసిన వ్యాఖ్యల రచ్చ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తాజాగా ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఎంటరైంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. తమిళనాడు ప్రభుత్వానికి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేల త్రివేది లతో కూడిన ధర్మాసనం.. ఎంపీ ఏ రాజా, ఎంపీ థోల్ తిరుమావళవన్, ఎంపీ తిరుసు వెంకటేశన్, తమిళనాడు డీజీపీ,

‘Sanatan Dharma’ remark: ఉదయ నిధి స్టాలిన్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..
Supreme Court of India

Updated on: Sep 22, 2023 | 5:39 PM

‘సనాతన ధర్మ’ పై చేసిన వ్యాఖ్యల రచ్చ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తాజాగా ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఎంటరైంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. తమిళనాడు ప్రభుత్వానికి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేల త్రివేది లతో కూడిన ధర్మాసనం.. ఎంపీ ఏ రాజా, ఎంపీ థోల్ తిరుమావళవన్, ఎంపీ తిరుసు వెంకటేశన్, తమిళనాడు డీజీపీ, గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషన్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు, తమిళనాడు రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ పీటర్ ఆల్ఫోన్స్ లకు కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు తొలుత విముఖత వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌ను కోరింది. అక్కడ విచారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఆ తరువాత కేసు విచారణకు అంగీకరించింది ధర్మాసనం. ఈ వ్యాఖ్యలు ఏం సందర్భంలో చేశారంటూ సుప్రీంకోర్టు పిటిషన్‌ను వేసిన న్యాయవాది బి జగన్నాథ్‌ను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు స్పందించిన న్యాయవాది.. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి తన ప్రసంగంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు అని బదులిచ్చారు. సాధారణ వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేశారంటే లైట్ తీసుకోవచ్చు.. కానీ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి.. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. విద్యార్థులను సైతం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటూ సర్క్యూలర్‌లు జారీ చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీని ద్వారా విద్యార్థులను సైతం బలవంతం చేస్తున్నానరని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఇదిలాఉంటే.. మంత్రి ఉదయనిధి స్థాలిన్ సహా ఇతరులెవరూ సనాతన ధర్మంపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని న్యాయవాది బాలాజీ గోపాలన్ సుప్రీంకోర్టును కోరారు. ఇక సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులో ఒక మంత్రి పాల్గొనడం అనేది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా మంత్రి ఉదయనిధి స్టాలిన్, పీటర్ ఆల్ఫోన్స్, ఎంపీ ఏ రాజా. థోల్ తిరుమావళవన్, మరికొందరు పేర్లను చేర్చారు. సనాతన ధర్మం, హిందూ మతానికి వ్యతిరేకంగా మరోసారి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

అంతేకాదు.. అసలు ఈ సదస్సుకు పోలీసులు ఎలా అనుమతిచ్చారు. బాధ్యులపై, కార్యక్రమం నిర్వహించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో రాష్ట్ర డీజీపీ నుంచి వివరణ తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కార్యక్రమం నిర్వహించిన సంస్థకు బాధ్యులు ఎవరు? ఎందుకోసం ఈ సమావేశం నిర్వహించారు? వంటి అంశాలపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశించాలని హోం సెక్రటరీ, సిబిఐ డైరెక్టర్‌ని ఆదేశించాలని కోర్టును కోరారు న్యాయవాది. అలాగు, సెకండరీ స్కూళ్లలో ‘సనాతన ధర్మం’పై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని తమిళనాడు ప్రభుత్వ ఉన్న విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

కాగా, సనాతన ధర్మాన్ని జబ్బులతో పోలుస్తూ.. దానిని కూకటివేళ్లతో పెకిలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ అంశంపై రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాల నేతలు సహా ఎంతో మంది తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్స్‌తో సహా 262 మంది ప్రముఖులు.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన విద్వేష పూరిత ప్రసంగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, విద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో అధికారికంగా ఫిర్యాదులు అందే వరకు ఎదురు చూడకుండా.. సుమోటోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను, పోలీసు అధికారులను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..