ఉత్తరప్రదేశ్ లో జరిగిన ‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ ‘ఘన’ విజయానికి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ని అభినందిస్తూ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ వివాదం రేపింది. ‘హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ థంపింగ్ విక్టరీ ఇన్ జిల్లా పంచాయత్ చైర్ పర్సన్ ఎలెక్షన్స్ ఇన్ యూపీ సర్’ అని ఆమె ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. (గత ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు సైనా నెహ్వాల్ బీజేపీలో చేరింది). అయితే ఈ ట్వీట్ పై కొన్ని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సైనా నెహ్వాల్ ను ‘సర్కారీ షట్లర్’ అని రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి విమర్శించారు. ప్రజల తీర్పును చిన్నాభిన్నం చేయడంలో బీజేపీ స్కిల్ (ప్రావీణ్యం) ని ఈ సర్కారీ షట్లర్ గుర్తించింది అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. సెలబ్రిటీలు తమ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి యత్నించినప్పుడు ఓటర్లు కూడా ‘డ్రాప్ షాట్లను’ ఆడాల్సిన అవసరం వచ్చిందని తాను భావిస్తున్నానన్నారు. సైనా బ్యాడ్మింటన్ ఆడడం ఎప్పుడు ఆపేస్తుందని తమిళనాడు కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ డా. అస్లమ్ బాషా ప్రశ్నించారు. మీ అభిమానుల్లో చీలిక ఏర్పడడానికి సెక్యులరిజం కారణం అవుతోందని..ఇక మీరు ఆడడం ఎప్పుడు ఆపేస్తారని ఆయన అన్నారు.
యూపీ ‘స్థానిక’ ఎన్నికల్లో 75 స్థానాలకు గాను బీజేపీ 67 స్థానాలను గెలుచుకుంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు, దీనికి సంబంధం లేదని, ఈ ఫలితాలను అప్పటి ఫలితాలతో అన్వయించుకోరాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకుంది. 2016 లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ 60 స్థానాలను గెలుచుకోగా ఈ సారి దీనికి పూర్తిగా చుక్కెదురైంది.
మరిన్ని ఇక్కడ చూడండి: హెల్త్ కేర్ వర్కర్లకు ‘భారత రత్న’ పురస్కారం ఇవ్వాలి.. ప్రధాని మోదీ కి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ