Sadhguru: కోడి మెడ ఏనుగుగా మారాలి.. చికెన్‌ నెక్‌పై సద్గురు కీలక కామెంట్స్

భారత భద్రతకు కీలకమైన సిలిగురి కారిడార్‌పై సద్గురు జగ్గీ వాసుదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చికెన్ నెక్‌గా పిలిచే ఈ ప్రాంతం 1971లోనే బలోపేతం చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలను దేశంతో కలిపే ఈ భూభాగాన్ని ఏనుగుగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల అంశాన్నీ ప్రస్తావిస్తూ.. దేశ సార్వభౌమత్వానికి ఈ కారిడార్ బలోపేతం అవసరమని నొక్కి చెప్పారు.

Sadhguru: కోడి మెడ ఏనుగుగా మారాలి.. చికెన్‌ నెక్‌పై సద్గురు కీలక కామెంట్స్
Sadhguru On Siliguri Corridor

Updated on: Dec 29, 2025 | 4:55 PM

భారత దేశ భౌగోళిక భద్రతకు అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ (చికెన్ నెక్) విషయంలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాలను భారత్‌తో కలిపే ఈ ఇరుకైన భూభాగం ఒక 78 ఏళ్ల నాటి చారిత్రక క్రమరాహిత్యం అని ఆయన అభివర్ణించారు. బెంగళూరులోని సద్గురు సన్నిధిలో జరిగిన సత్సంగంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

1971లో చేజారిన అవకాశం

భారత విభజన సమయంలో ఏర్పడిన ఈ భౌగోళిక లోపాన్ని 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాతే సరిదిద్ది ఉండాల్సిందని సద్గురు అభిప్రాయపడ్డారు. “బహుశా 1947లో మనకు ఆ శక్తి లేకపోయి ఉండవచ్చు, కానీ 1972లో మనకు పూర్తి అధికారం ఉంది. అప్పుడే ఈ సమస్యను పరిష్కరించడంలో మనం విఫలమయ్యాం” అని ఆయన వ్యాఖ్యానించారు. దశాబ్దాల క్రితం జరగాల్సిన ఈ దిద్దుబాటు చర్య ఇప్పుడు దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కోడి మెడ.. ఏనుగుగా మారాలి

సిలిగురి కారిడార్‌ను ఉద్దేశించి ఆయన ఒక ఆసక్తికరమైన పోలికను చెప్పారు. “ఇప్పుడు చికెన్ నెక్ గురించి చర్చ మొదలైంది. ఈ కోడిని బాగా పోషించి దానిని ఏనుగుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం యొక్క పునాది బలహీనతపై ఆధారపడకూడదు. దానికి ఏది అవసరం అనేది పక్కనబెడితే.. ఆ మెడ ఏనుగు మెడంత బలంగా ఉండాలి. ఏ నిర్ణయానికైనా కొంత మూల్యం చెల్లించక తప్పదు.. కానీ దేశ సమగ్రత కోసం అది అవసరం” అని సద్గురు అన్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసపై ఆందోళన

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు, దేవాలయాల విధ్వంసంపై కూడా సద్గురు ఘాటుగా స్పందించారు. హిందువులను బలవంతంగా తరిమివేయడం, జనాభా ఒత్తిడి పెంచడం వంటి అంశాలను కేవలం పొరుగు దేశం యొక్క అంతర్గత విషయాలుగా తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు. విభజన సమయంలో జరిగిన భౌగోళిక, నాగరికత లోపాల వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన విశ్లేషించారు.

సరిహద్దులు లేని ప్రపంచం..

సరిహద్దులు లేని ప్రపంచం అనేది వినడానికి అద్భుతంగా ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని సద్గురు అభిప్రాయపడ్డారు. అందరినీ ఆలింగనం చేసుకునే స్థాయికి మానవాళి ఇంకా చేరుకోలేదని, ప్రస్తుతానికి దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతే అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. సిలిగురి కారిడార్‌ను బలోపేతం చేయడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు రక్షణ కవచంలా మార్చాలన్న సద్గురు పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.