శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జనవరి 14న పండుగ రోజు మకర జ్యోతిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు భక్తులు. అయ్యప్న దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది . పంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్ ఉంది. అయితే భక్తుల రద్దీ కారణంగా కేవలం 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పించారు. దీంతో సోమవారం నుంచి ఆన్‌లైన్ దర్శనాలు కుదించారు అధికారులు. సోమవారం 50 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు.
మంగళవారం 40 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఈనెల 15వ తేదీన 60 వేల మందికి ఆన్‌లైన్ దర్శనం కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు , ట్రావెన్‌కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణకు చెందిన రమేశ్ అనే వ్యాపారవేత్త అయ్యప్పస్వామికి బంగారు విల్లు , బంగారు బాణం , వెండి ఏనుగులను బహుకరించారు.
తిరుపతి ఘటనతో అప్రమత్తమైన శబరిమల
తిరుపతి ఘటనతో, మరోసారి గత విషాదాలను, చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంది శబరిమల. ఇక మకరవిళక్కు….ఈ నెల 14న సంక్రాంతి నాడు రానుంది. ఆ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు..మకరజ్యోతి ముమ్మార్లు కనిపిస్తుంది. ఇప్పటికే లక్షలాదిమంది భక్తులతో శబరిమల కిటకిటలాడుతోంది. ఇక మకర జ్యోతి దర్శనం ఇచ్చే రోజున ఆ జన సందోహం…మరింత భారీగా మారుతుంది. ఆ సమయంలో ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటలకు తావు ఇవ్వకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
మకర జ్యోతి దర్శనం కోసం ఇప్పటికే శబరిమలకు లక్షలాదిగా పోటెత్తారు భక్తులు. అయితే తిరుపతి తొక్కిసలాట ఘటనతో శబరిమల ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. మకరజ్యోతి నాడు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఆన్‌లైన్ దర్శనాల టికెట్ల సంఖ్యను అధికారులు కుదించారు.