బెంగాల్‌లో రసవత్తరంగా మారుతున్న రాజకీయాలు.. నాడియా జిల్లాలో బీజేపీ, తృణమూల్ పోటా పోటీ యాత్రలు

అధికార తృణమూల్ కాంగ్రెస్ - బీజేపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. పోటా పోటీ ఎన్నికల ప్రచారానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

బెంగాల్‌లో రసవత్తరంగా మారుతున్న రాజకీయాలు.. నాడియా జిల్లాలో బీజేపీ, తృణమూల్ పోటా పోటీ యాత్రలు
Follow us

|

Updated on: Feb 05, 2021 | 9:56 PM

Bengal political tension : అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ – బీజేపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. పోటా పోటీ ఎన్నికల ప్రచారానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే, బీజేపీ చేపట్టనున్న పరివర్తన్‌ రథయాత్రకు ప్రభుత్వం అనుమతిపై రచ్చ కొనసాగుతుంది. ఈ యాత్రకు అనుమతిస్తే సరి… లేదంటే యుద్దం తప్పదని బీజేపీ హెచ్చరించింది. అయితే యాత్రను తాము ఎక్కడ అడ్డుకోవడం లేదని తృణమూల్‌ కౌంటరిచ్చింది.

బెంగాల్‌లో శనివారం నుంచి బీజేపీ తలపెట్టిన పరివర్తన్‌ రథయాత్రపై సస్పెన్స్‌ నెలకొంది. నాడియా లోని నబాద్వీప్‌ నుంచి పరివర్తన్‌ ర్యాలీకి శ్రీకారం చుట్టబోతున్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. అయితే ఇప్పటివరకు కూడా ర్యాలీకి ఇంకా అనుమతి ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. నడియాలో బీజేపీ సభకు మాత్రమే అనుమతి ఇచ్చామని , పరివర్తన్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అంటున్నారు పోలీసులు. పరివర్తన్‌ ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చినా .. ఇవ్వకపోయినా తమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారయాత్ర కొనసాగి తీరుతుందని బీజేపీ స్పష్టం చేస్తోంది. అయితే యాత్రను తాము ఎక్కడ అడ్డుకోవడం లేదని తృణమూల్‌ కౌంటరిచ్చింది.

మరోవైపు, కార్యక్రమం యథాతధంగా కొనసాగుతుందని బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ప్రకటించారు. ర్యాలీని అడ్డుకోవడానికి తృణమూల్‌ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పరివర్తన్‌ రథయాత్రపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీ నేతలకు స్థానిక పోలీసులు రెండు లేఖలు రాశారు. అయితే స్థానిక పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సీఆర్‌పీఎఫ్‌తో భద్రత కల్పించాలని , ఎన్నికలు కూడా కేంద్ర బలగాలతో నిర్వహించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

అటు, బీజేపీ నేతల ఆరోపణలను తృణమూల్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. పరివర్తన్‌ రథయాత్రకు అనుమతి నిరాకరించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. మరోవైపు, బిజెపి పరివర్తన్ రథయాత్ర చేపట్టబోయే నాడియా జిల్లాలోని తృణమూల్ యూత్ కాంగ్రెస్ కూడా రెండు రోజుల జనసమార్థన్ యాత్రను చేపట్టాలని నిర్ణయించింది. ఈ యాత్రను రేపు ప్రారంభిస్తారని ప్రకటించారు. వేలాది మోటార్ సైకిళ్లతో జిల్లావ్యాప్తంగా ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఇదిలావుంటే, బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు గవర్నర్‌ను ఆహ్వానించకుండానే అసెంబ్లీని నిర్వహించింది తృణమూల్ ప్రభుత్వం. సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సీఎం మమతా బెనర్జీ. గవర్నర్‌ను ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. మమత ప్రసంగాన్ని అడ్డుకున్నేందుకు విపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్‌. మమత బడ్జెట్‌ ప్రసంగాన్ని సీపీఎం, కాంగ్రెస్‌ సభ్యులు కూడా బహిష్కరించారు. సభ బయట బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగాల్‌ పోలీసు శాఖలో కొత్తగా నేతాజీ బెఠాలియన్‌ ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు మమత. నేతాజీ వారసత్వం కోసం అటు బీజేపీ , ఇటు తృణమూల్‌ మధ్య ఫైట్‌ కొనసాగుతోంది. ఎన్నికల వేళ బెంగాల్‌లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు ఇరుపార్టీల నేతలు.

ఇదీ చదవండి… నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష… ఈ ఏడాది రూ.32 వేల కోట్ల అంచనాలతో ఇరిగేషన్ బడ్జెట్‌..!