DK Shivakumar: డీకేను మట్టుబెట్టేందుకు అఘోరాల నేతృత్వంలో ‘పంచ బలి’ .. ఆయన నోటితోనే

చుట్టూ చిమ్మచీకటి.. స్మశానంలో తాంత్రిక పూజలు..! ఇక్కడ బొమ్మకు సూదులు గుచ్చితే..ఎక్కడో ఉన్న వ్యక్తికి గాయమవుతుంది. ఇదేదో బ్లాక్ మ్యాజిక్‌ మూవీ సీన్‌ కాదు. రాజకీయ శత్రువులు తనపై ఇలాంటి పూజలనే చేస్తున్నారని చెబుతున్నారు..కర్నాటక ఉపముఖ్యమంత్రి. తనను మట్టుబెట్టేందుకు కేరళ మాత్రికులు రంగంలోకి దిగారని అనుమానం వ్యక్తం చేస్తున్నారాయన. దానికి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇంతకూ డీకేఎస్‌కు ఈ అనుమానం ఎందుకు వచ్చింది..?

DK Shivakumar:  డీకేను మట్టుబెట్టేందుకు అఘోరాల నేతృత్వంలో ‘పంచ బలి’ .. ఆయన నోటితోనే
D. K. Shivakumar

Updated on: May 31, 2024 | 9:04 PM

రాజకీయాలందు కన్నడ రాజకీయాలు వేరన్నట్టు ఉంటాయి..అక్కడి పరిస్థితులు. ఎక్కడో మొదలైన విషయం..ఎక్కడెక్కడో తిరిగి..చివరకు అనుకోని టర్న్‌ తీసుకుంటుంది కన్నడ రాజకీయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో విష సర్పం, విషకన్య అంటూ ఆరోపణలు చేసుకున్న నేతలు..ఇప్పుడు యజ్ఞాలు, యాగాలు, తాంత్రిక పూజలపై పడ్డారు. సీఎంతో పాటు తనకు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు రాజకీయ ప్రత్యర్థులు యాగాలు చేస్తున్నారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు..కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.

తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘శత్రు భైరవి యాగం’ చేస్తున్న వారి వివరాలు తన దగ్గర ఉన్నాయన్న డీకేఎస్‌.. కానీ వాటిని బయటపెట్టబోనని చెప్పారు. ఆ యాగం విజయవంతం కావడానికి ‘పంచ బలి’ అంటే దున్నలు, గొర్రెలు వంటివి ఇవ్వాల్సి ఉంటుందన్న డీకేఎస్‌..దాన్ని అఘోరాల నేతృత్వంలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అయితే తాను విశ్వసిస్తున్న శక్తులు ఆ యాగం నుంచి కాపాడతాయని ధీమా వ్యక్తం చేశారు.

డీకే శివకుమార్‌ వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఈ కామెంట్స్‌పై మండిపడుతున్నారు..కేరళ నేతలు. తమ రాష్ట్రంలో అలాంటి కార్యకలాపాలేమీ జరగవని స్పష్టం చేశారు..కేరళ మంత్రి డాక్టర్ ఆర్‌.బిందు. డీకేఎస్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. దేశంలో కొన్నిచోట్ల సమాజాన్ని చీకటియుగంలోకి నెట్టే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. తమ రాష్ట్రంలో అలాంటివాటికి తావు లేదని అయినా డీకేఎస్‌ ఆరోపణల నేపథ్యంలో కేరళలో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయేమో పరిశీలిస్తామని చెప్పారు.

మరోవైపు డీకే శివకుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు..హేతువాదులు. ప్రజల్లో ఉన్న మూడ నమ్మకాలను పారదోలాల్సిన ప్రభుత్వ పెద్దలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజాన్ని వెనక్కి నడపమేనంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి