US Minster Antony Blinken India Tour: భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇవాళ బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధులతో సమావేశమయ్యారు. దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్‌చుంగ్‌తో అమెరికా మంత్రి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఇది ఓ రకంగా డ్రాగన్ కంట్రీకి మింగుపడని విషయం. 1950లో చైనా దళాలు టిబెట్‌ను ఆక్రమించాయి. 1959లో మతగురువు దలైలామా ఆ దేశం నుంచి పారిపోయారు.నోడుప్‌తో అమెరికా మంత్రి భేటీపై చైనా విదేశాంగ శాఖ స్పందించలేదు. చైనాలో టిబెట్ అంతర్భాగమని, దలైలామా తీవ్రమైన వేర్పాటువాది అని డ్రాగన్ దేశం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
మరో వైపు మంత్రి బ్లింకెన్ ఇవాళ విదేశాంగ మంత్రి సుబ్రమణియం జైశంకర్‌ను కలిశారు. కోవిడ్ టీకాల సరఫరా, ఆఫ్ఘనిస్తాన్‌లో తాజా పరిస్థితి, దేశంలో మానవ హక్కుల అంశంపై ఇద్దరు మంత్రులు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య బంధం కీలకమైందని బ్లింకెన్ తెలిపారు.
ఇదిలావుంటే, భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దాడులు, ఇండో-పసిఫిక్, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత పరిస్థితులపై వీరిరువురు చర్చించారు.
ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని దోవల్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ చర్చల్లో దాదాపు ఓ గంటపాటు ప్రపంచంలో పెరుగుతున్న సంఘర్షణల పరిస్థితులపై మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపైనా, దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్‌లలో చైనా దూకుడుపైనా బ్లింకెన్ తన అభిప్రాయాలను అరమరికలు లేకుండా దోవల్‌తో పంచుకున్నారు. అనంతరం అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతంలో భద్రత, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దాడులు, తూర్పు లడఖ్‌లో పరిస్థితులపై భారత దేశ వైఖరిని వివరించారు. తాలిబన్ల ఆగడాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ సుస్థిరతకు మార్గాలపై ఇరువురు చర్చించామని తెలిపారు.
US Secretary of State Antony Blinken and National Security Advisor Ajit Doval in an hour-long meeting exchanged views on contemporary and futuristic issues related to regional and global security: Government officials pic.twitter.com/Fx0S23CbUd
— ANI (@ANI) July 28, 2021
అమెరికాలో అక్టోబరులో జరగబోయే క్వాడ్ సమావేశాలపై కూడా వీరిరువురు భేటీ అయ్యారు. క్వాడ్ దేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా అక్టోబరులో వాషింగ్టన్‌లో జరిగే సమావేశానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే, జపాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి హాజరవడంపై ఇంకా ధ్రువీకరించవలసి ఉంది.