Reliance Covid Drug: కరోనా సెకండ్ వేవ్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. కరోనా చికిత్సలో కొత్త ఔషధాన్ని లాంచ్ చేసే ప్రయత్నల్లో రిలయన్స్ బిజీగా ఉంది. అలాగే చౌక కరోనా టెస్టింగ్ కిట్‌ను కూడా లాంచ్ చేయనుంది. కరోనాపై పోరుకు తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త డ్రగ్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కోవిడ్ రోగులకు నిక్లోసమైడ్ డ్రగ్‌ను ఉపయోగించవచ్చని ప్రతిపాదించింది. దీన్ని వినియోగించేందుకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసిన రిలయన్స్…తన వార్షిక నివేదికలో కూడా ఈ అంశాన్ని పేర్కొంది. అయితే దీనిపై డీసీజీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మందును తయారు చేసేందుకు రిలయన్స్ ప్రణాళికలు రచిస్తోందా లేక గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో దీన్ని వినియోగిస్తారా అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
అయితే ఈ నిక్లోసమైడ్ అనే మందును గత యాభై ఏళ్లుగా నులిపురుగుల నివారణకు వాడుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర మందుల జాబితాలో భాగంగా ఉంది. గతంలో సార్స్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించినప్పుడు కూడా ఈ డ్రగ్‌ను వాడారు. భారత ప్రభుత్వం కోవిడ్ రోగుల చికిత్సలో దీన్ని వినియోగించేందుకు పేజ్-2 క్లీనికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. కాగా, రిలయన్స్ గ్రూప్ వైరస్, బ్యాక్టీరియాలపై పొరలను నాశనం చేసే నెక్సర్ పాలిమర్‌పై పలు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థలతో కలసి పనిచేస్తోంది.