Ratan Tata: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మేమున్నాం అంటూ ఆదుకోవడానికి అండగా నిలబడడానికి ముందుకొచ్చే సంస్థల్లో ప్రధానమైంది టాటా.. ఇక నేటి తరానికి రతన్ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా తమకు లాభం కంటే.. దేశ ప్రయోజనాలు, సంస్థల అభివృద్ధి ముఖ్యమని ఎయిర్ ఇండియా సంస్థను తీసుకుని మరోసారి రుజువు చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థ కోసం 18,000 కోట్లకు బిడ్ వేసి టాటా సన్స్ తన సొంతం చేసుకుంది. నిజానికి ఈ ఎయిర్ ఇండియా సంస్థను టాటాలే స్థాపించారు. ఆ తరువాత అందులో భారత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంతో అది ప్రభుత్వరంగ సంస్థగా మారింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోవడంతో తిరిగి టాటాలు బిడ్‌లో దక్కించుకున్నారు. ఇక ఈ విక్రయానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా 2021 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి.
తాము స్థాపించిన సంస్థ తిరిగి టాటాలకు చేరడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్న రతన్ టాటాకు ముంబైలోని సర్ రతన్ టాటా ఇనిస్టిట్యూట్ ఎయిర్ ఇండియా విమానం ఆకారంలో ఉన్న బిస్కెట్‌ను బహుమతిగా పంపింది. ఎటువంటి లాభాలను ఆశించకుండా ముంబైలో సర్ రతన్ టాటా ఇనిస్టిట్యూట్ పేరుతో బేకరీని నిర్వహిస్తున్నారు. పార్శి రుచులను అందరికి పరిచయం చేసేందుకు 1928లో లేడీ నవాజ్‌భాయ్ టాటా ఈ బేకరీని స్థాపించారు. అప్పటి నుంచి అతి తక్కువ ధరలకే బేకరీ ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నారు. మరోవైపు తాము బీడ్ గెలుచుకున్నట్లు వార్తలు వెలువడిన వెంటనే ‘వెల్‌కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రతన్ టాటా. అంతేకాదు జెఆర్‌డీ టాటా నాయకత్వంలో నడిచిన ఎయిర్ ఇండియా గతంలో ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక విమానయాన సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని గుర్తు చేసుకున్నారు రతన్ టాటా
Also Read: ఓ వైపు ప్రజలు త్యాగాలు చెయ్యాలి ఒక్కపూటే తినమంటున్న పాక్ మంత్రి.. మరో వైపు కప్పు ‘టీ’ రూ. 40..