తన నిష్పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తనపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా తనకు ఎలాంటి సమస్యా లేదన్నారు. మొదట… కొన్ని రోజుల క్రితం టీడీపీ సభ్యుడొకరు చేసిన కామెంట్లపై విజయ సాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ ఆ సభ్యునిపై చర్య తీసుకోవాలని కోరారు. అయితే ఆ సభ్యుని పేరును ఆయన ప్రస్తావించలేదు. రికార్డుల నుంచి అభ్యంతరకర పదాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఇది పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాదని, ఈ సభ్యుడు లిఖితపూర్వకంగా వివరాలు అందిస్తే పరిశీలించి అభ్యంతరకరంగా ఉన్న వ్యాఖ్యలను తొలగిస్తానని వెంకయ్యనాయుడు అన్నారు. కానీ ఈ సమాధానంతో సంతృప్తి చెందని విజయసాయి.. చైర్మన్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మైక్ కట్ చేసి..రికార్డులకు ఏదీ ఎక్కదని చైర్మన్ చెబుతున్నా ఆయన వినలేదు. నేను పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నానని మీరు విమర్శలు చేస్తున్నారని, కానీ ఇది తననెంతో బాధించిందని వెంకయ్య అన్నారు . ఈ దశలో కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ లేచి.. ఈ సభ్యుడు చేసిన కామెంట్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈయనపై చర్య తీసుకోవాలని అన్నారు.
ఇతర సభ్యులుకూడా ఈయనతో గళం కలిపారు. ఈ పరిణామాలపై స్పందించిన వెంకయ్యనాయుడు.. ఈ రోజు తనకెంతో బాధ కలిగిందన్నారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. సభలో ఓ డిబేట్ లేదా చర్చ జరుగుతున్నప్పుడు ఏవైనా అభ్యంతరకర పరిణామాలు జరిగితే వాటిని చైర్మన్ దృష్టికి తేవాలని, వాటిని పరిశీలించి రికార్డులనుంచి తొలగించడంజరుగుతుందని చెప్పారు. కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన ఉదంతం పై ఎవరూ నిరసన గానీ, అభ్యంతరం గానీ వ్యక్తం చేయలేదని తనకు అనిపించిందన్నారు. తాజాగా ఇది చైర్మన్ ను పని చేయకుండా చూడాలన్నదేనని, కానీ తను అలా జరగనివ్వబోనని ఆయన చెప్పారు. రాజ్యసభ చైర్మన్ పదవిని అంగీకరించే ముందు బీజేపీకి తాను రాజీనామా చేశానని, ఈ రాజ్యాంగ బద్ద పదవి కారణంగా ఏ విధమైన రాజకీయ కార్యక్రమాలకు హాజరు కావడంలేదని ఆయన చెప్పారు.
Read Also:కేరళలో దారుణం, ‘అల్లా’కు తన ఆరేళ్ళ కొడుకును బలి ఇచ్చిన తల్లి, అరెస్టు చేసిన పోలీసులు