TRS on PM Modi: ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు.. రాజ్యసభ కార్యదర్శికి ఇచ్చిన టీఆర్ఎస్

|

Feb 10, 2022 | 11:04 AM

కేంద్రంపై యుద్ధం ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్‌.. ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు.

TRS on PM Modi: ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు.. రాజ్యసభ కార్యదర్శికి ఇచ్చిన టీఆర్ఎస్
Trs On Modi
Follow us on

TRS MPs move Privilege Motion against PM Narendra Modi: కేంద్రంపై యుద్ధం ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్‌(KCR).. ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. టీఆర్ఎస్(TRS) ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన విషయంలో పార్లమెంటును, సభాపతిని అవమానపరిచేలా ప్రధాని మాట్లాడారని రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు 187వ నిబంధన కింద రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పార్టీ ఎంపీలు కె.కేశవరావు (కేకే), సంతోష్‌కుమార్‌, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ కలిసి నోటీసు అందజేశారు.

మామూలుగా బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి భగ్గు భగ్గు. అలాంటిది డైరెక్ట్‌గా రాష్ట్రాల విభజనే తప్పు అంటూ కాషాయం కవ్విస్తే.. తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేదీలేదని గులాబీ దళం గుర్రుగా ఉంది. ఇక ఈరెండు పార్టీల నడిమిట్ల కాంగ్రెస్ కూడా దూరింది. ప్రధాని మోడీ వ్యాఖ్యలు తెలంగాణలో చిచ్చు పెట్టాయి. మొన్న రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన బాటపట్టారు.

మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన మోడీ, కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును తొందరపడి ఆమోదించడాన్ని తప్పుబట్టారు. ఎటువంటి చర్చ లేకుండా ఫిబ్రవరి 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యతిరేకం కాదని పేర్కొంటూనే, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మైకులు కట్ చేశారని, తలుపులు మూసివేశారని, కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారని ప్రధాని అన్నారు. “విభజన బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించడం జరిగింది. విభజన ప్రక్రియపై వాటాదారులతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదు, దీని కారణంగా రెండు వైపులా ఇంకా ఆందోళనలు కొనసాగుతోంది” అని ఆయన అన్నారు.

ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ ఉద్యమాన్నే అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు చేపట్టి ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రజలకు మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లజెండాలు పట్టుకుని మోటార్‌సైకిల్‌ ర్యాలీలు నిర్వహించి, ప్రదర్శనలు నిర్వహించి, నల్ల బెలూన్‌లను గాలిలోకి వదిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సెక్రటరీకి ప్రధాని మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటుసులు ఇచ్చారు. సభా చైర్మన్ కు టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు జోగినిపల్లి సంతోష్ తదితరులు ఈ నోటీసు ఇచ్చారు..మరోవైపు రాజ్యసభను ఈరోజు బహిష్కరిస్తున్నట్లు గా టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా టీఆర్ఎస్ వాదనతో ఏకీభవించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టీఆర్ఎస్ కు మద్దతు పలికారు.


Read Also… Pawan Kalyan: వరుస సినిమాలతో పవన్ జోరు.. మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్..