రాకేష్ టికాయత్.. ఇప్పుడు దేశంలో అందరికి సుపరిచితమైన పేరు.. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు టికాయత్. అయితే ఆయన ఆస్తుల చిట్టా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బడా బిజినెస్ మ్యాన్‌లను తలదన్నేలా ఆస్తులు సంపాదించారు టికాయత్. రాజధాని హస్తిన శివారులో కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో రైతులను ముందుండి నడిపిస్తున్నారు రాకేష్ టికాయత్. తాజాగా బయటపడ్డ ఆయన ఆస్తుల చిట్టా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాలుగు రాష్ట్రాలు..13 నగరాల్లో అతనికి దాదాపు 80కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు బయటపడింది.
ఒకప్పుడు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఉన్న రాకేష్ టికాయత్ ఇప్పుడు 80కోట్ల రూపాయలకు అధిపతి. ల్యాండ్స్, పెట్రోల్ పంప్స్, షో రూమ్స్, బ్రిక్స్ ఇలా పలు వ్యాపారాల్లో ఈయనకు పెట్టుబడులున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో వ్యాపారాలున్నాయి. ముజఫర్ నగర్, లలిత్‌పూర్, ఝాన్సీ, లఖిమ్‌పూర్ ఖేరి, బిజ్నోర్, బడాన్, ఢిల్లీ, నోయిడా, ఝజియాబాద్, డెహ్రాడూన్, రూర్కీ, హరిద్వార్, ముంబైల్లో కూడా ఆయనకు ఆస్తులున్న విషయం బయట పడింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంతో వెలుగులోకొచ్చారు రాకేష్ టికాయత్. రైతు పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అన్నదాతల ఆందోళనలు అనగానే రాకేష్ టికాయత్ పేరే గుర్తొస్తుంది. అంతలా పోరాటం చేస్తున్నారాయన. ఒకసారి ఉద్యమం చల్లారినట్లు కనిపించినా..ఆయన రాల్చిన రెండు కన్నీటి చుక్కలు పోరాటాన్ని మరో మలుపు తిప్పాయి. ఆ సెంటిమెంట్‌తో మళ్లీ కదం తొక్కుతున్నారు అన్నదాతలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయనకు మద్దతుగా నిలిచింది యావత్ రైతు లోకం.
అయితే టికాయత్ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతకుముందు కానిస్టేబుల్‌గా పనిచేసిన టికాయత్ ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం టికాయత్ వయసు 51 ఏళ్లు. 1985లో సునీతా దేవిని పెళ్లి చేసుకున్నారు టికాయత్. వీరికి ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె జ్యోతి టికాయత్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అక్కడ కూడా జ్యోతి టికాయత్ కర్షకులకు సంఘీభావం తెలుపుతున్నారు. మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 8న రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అయితే అన్నదాతల కోసం గళమెత్తిన రాకేష్ టికాయత్ కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.