Rajasthan CM Ashok Gehlot: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు వరకూ అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేసి స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానంటూ ఆయన వెల్లడించారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ట్విట్ చేశారు.
కాగా… గెహ్లాట్ భార్య సునీతకు బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గెహ్లాట్ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో గెహ్లాట్ కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. కాగా.. తాను కరోనా బారిన పడినప్పటికీ.. రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితులకు సంబంధించి ప్రతి రోజు రాత్రి 8:30 గంటలకు డాక్టర్లతో, అధికారులతో సమీక్ష జరుపుతానని ప్రకటించారు.
ఇదిలాఉంటే.. రాజస్థాన్‌లో బుధవారం 16,613 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 120 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3,926 మంది మరణించగా.. 5,63,577 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,63,372 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: