మనదగ్గరే కాదు మహారాష్ట్రలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై మహానగరంతో పాటు రాష్ట్రం లోని పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ముంబై శివార్ల లోని భివాండిలో వరద పోటెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. కార్లతో పాటు ఇతర వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. రత్నగిరిలో కుంభవృష్టి కురిసింది. కొండచరిచయలు విరిగిపడడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగం లోకి దింపారు.
బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహించడంతో ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబైతోపాటు థానే మున్సిపల్ కార్పొరేషన్‌లు అలర్ట్ జారీ చేశాయి. నాసిక్‌లో కొండచరియలు విరిగిపడడంతో రైల్వేట్రాక్‌లు ధ్వంసమయ్యాయి.
దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పుణే సమీపంలో చాలా డ్యాంలు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. పశ్చిమ కనుమల్లో భారీ వర్షం రికార్డులు సృష్టిస్తోంది. మహాబలేశ్వర్‌లో రికార్డు స్థాయిలో 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
ముంబై శివార్ల లోని కళ్యాణ్ ,బివాండి .బద్లాపూర్.ఉల్హాస్‌నగర్ ప్రాంతాల్లో ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించింది. తూర్ప విదర్భ ప్రాంతంలో భారీ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రత్నగిరిలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి. త్రయంబకేశ్వరంతో పాటు నాసిక్ ఏరియాల్లో కుండపోత కురిసింది. దీంతో నాసిక్‌లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది.