Indian Railways – Farmers Protest: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు రేపు రైల్‌రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనపై ఇంటిలిజెన్స్ సమాచారంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ప్రభావిత రాష్ట్రాల్లో పలు రైళ్లను దారి మళ్లించడంతో పాటు కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ముందుజాగ్రత చర్యగా 20 కంపెనీల అదనపు బలగాలను రంగంలోకి దింపుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ బుధవారం ప్రకటించింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు వెల్లడించింది. ఇంటిలిజెన్స్ నివేదికల ప్రకారం హింసాత్మక ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు.
ఇంటలిజెన్స్ సమాచారం మేరకు ఈ రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇందుకోసం 20వేల అదనపు సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. రైతు సంఘాలు రైల్ రోకో నేపథ్యంలో ప్రతిఒక్కరూ శాంతియుతంగా ఉండాలని.. శాంతియుతంగా నిరసన తెలపాలని అరుణ్ కుమార్ సూచించారు. రైల్ రోకో నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను సైతం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదిలాఉంటే.. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ రేపు నాలుగు గంటలపాటు రైల్ రోకో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్ రోకోను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: