ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో తొలిసారి పర్యటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి సృతి ఇరానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఈ పర్యటనలో భాగంగా గౌరీగంజ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్ధానిక నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
అమేథీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి పెట్టని కోట. 1980లో సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసి రాజీవ్ గాంధీ విజయం సాధించారు. అదే విధంగా రాహుల్ గాంధీ కూడా 2004,2009,2014 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు.
ఈసారి జరిగిన ఎన్నికల్లో రాహుల్ రెండు స్ధానాలనుంచి పోటీచేసారు. అయితే పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీలో పరాజయం పాలైనా.. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గంనుంచి గెలిచారు. మరోవైపు ఘోర ఓటమిని చవిచూడటంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా సమర్పించారు.