Rahul Gandhi on Jyotiraditya Scindia: మధ్యప్రదేశ్‌కు చెందిన యువ నాయకుడు జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన రాజ్యసభకు సైతం ఎన్నికయ్యారు. అయితే జ్యోతిరాధిత్య సింథియా పార్టీ మారి చాలాకాలమైన తరువాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైనశైలిలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్‌లో ఉండి ఉంటే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారని రాహుల్ పేర్కొన్నారు. కానీ ఆయన బీజేపీలో చేరడం వల్ల బ్యాక్‌బెంచర్‌గా మారారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్కర్లతో కలిసి పనిచేసి.. పార్టీని బలోపేతం చేసే అవకాశం సింథియాకు ఉండేదని కానీ.. ఆయన బీజేపీలో చేరి వెన్నముక లేని వారితగా తయారయ్యారని రాహుల్ తెలిపారు. ఏదో ఒక రోజు సీఎం అవుతారని సింథియాకు చెప్పానని, కానీ ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నారన్నారు. మీరిది రాసుకోండి.. అక్కడ ఆయన ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరు.. ఆ పదవి కావాలంటే ఆయన ఇక్కడకు రావాల్సిందే అని కార్యకర్తలతో రాహుల్ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సిద్ధాంతాలతో పోరాడేందుకు యూత్ వింగ్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, భయపడవద్దంటూ రాహుల్ సూచనలు చేశారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి కీలక నేతగా ఎదిగిన జ్యోతిరాధిత్య సింథియా పలు పదవులను సైతం చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కమల్ నాథ్ సీఎం, జ్యోతిరాధిత్య సింథియా డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. అనంతరం వారిమధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో జ్యోతిరాధిత్య సింధియాతోపాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గత ఏడాది మార్చిలో బీజేపీలో చేరారు.
Also ReadL: