Navjot Singh Sidhu Sensational comments on Punjab Govt.: క్రికెటర్ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సిక్సర్ల నవజ్యోత్‌సింగ్ సిద్దూ కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సూచించిన ఎజెండాను పంజాబ్‌లో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌పై ట్వీట్ చేశారు.
ఇటీవల రాహుల్‌గాంధీని కలిసిన దగ్గరి నుంచి దూకుడు పెంచారు నవజ్యోత్‌సింగ్ సిద్దూ. త్వరలోనే ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే జోరు పెంచారు. అయితే, పంజాబ్‌లో అధికారంలో ఉన్న సొంత పార్టీపైనే ఆయన ఎదురుదాడికి దిగుతున్నారు.
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అమరీందర్‌సింగ్ సిఎంగా ఉన్నారు. అయితే ఇటీవల రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు సిద్దూ. తాజాగా పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు సిద్ధూ. అంతేకాదు రోజంతా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు కూడా తక్కువ ధరకే కరెంటు సరఫరా చేయాలని ట్వీట్ చేశారు. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే 9వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. దీంతోపాటు, గృహ, పారిశ్రామిక అవసరాలకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌పై 10–12 రూపాయల వరకు విధిస్తున్న సర్‌ఛార్జిని 3 నుంచి 5 రూపాయలకు తగ్గించాలని ట్వీట్ చేశారు.
Had a review meeting with the officials of electricity department & power distribution companies today. Discussed in detail the current status of power supply in Delhi amidst the peak demand for electricity in the capital. pic.twitter.com/aWZgMMjLCL
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 3, 2021
పంజాబ్‌లో అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా, అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేస్తామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సిద్ధూ డిమాండ్ చేయటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పంజాబ్‌లో కాంగ్రెస్ అధిష్టానం సూచించిన 18 అంశాలతో కూడిన ప్రజానుకూల ఎజెండాను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సిద్దూ. జాతీయ విధానం ప్రకారం కొత్తగా విద్యుత్ కొనుగోలు ధరలను నిర్ణయిస్తూ పంజాబ్ శాసనసభ కొత్త చట్టాలను ఆమోదించాలని సూచించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పలు అంశాలపై విభేదిస్తూ వస్తున్న సిద్ధూ, తాజాగా ఈ ట్వీట్లు చేయడం ఆసక్తిగా మారింది. అయితే సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఎలా అని అమరీందర్‌సింగ్ వర్గీయులు వాపోతున్నారు.