Punjab Congress crisis irks party high-command: ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటే.. వారిని విపక్షానికి చెందినవారే అనుకుంటాం. అదేంటో గానీ పంజాబ్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది గత కొన్ని రోజులుగా. త్వరలో ఎన్నికలు ఎదుర్కోబోతున్న రాష్ట్రంలో అధికార పార్టీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు నాలుగున్నరేళ్ళుగా తమ ప్రభుత్వం అస్సలు పనే చేయడం లేదంటూ ముఖ్యమంత్రిని మార్చాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో భాగస్వాములైన నలుగురు కూడా ఈ డిమాండ్‌తో రోడ్డెక్కడం విచిత్రంగా కనిపిస్తోంది. చూసే వాళ్ళకు సరదాగా వుండొచ్చుగాక.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాత్రం తలనొప్పిగా మారిందీ పొలిటికల్ డెవలప్‌మెంట్.
నాలుగున్నరేళ్ళుగా తమ ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు. ఈ సీఎం గద్దె దిగాలి… ఇంకో అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలొస్తున్న సమయంలో ఇలాంటి విమర్శలు సాక్షాత్తు సొంత పార్టీ ఎమ్మెల్యేలే చేస్తుండడం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అసౌకర్యంగా మారింది. ఈ డిమాండ్ విపక్షాల నుంచి వినిపిస్తే.. దానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు వందిమాగధులను రెడీ చేసే వారేమో కానీ.. సొంత పార్టీకి చెందిన వారు.. అదీ ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు.. నలుగురు మంత్రులు తన ప్రభుత్వాన్ని విఫలమైన సర్కార్‌గా ప్రచారం చేస్తుండడం అమరీందర్ సింగ్‌కు ఇబ్బందికరంగా మారిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఉన్న 77 మంది ఎమ్మెల్యేలలో 30 మంది ఎమ్మెల్యేలు.. సీఎం గద్దె దిగాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాజా అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకూ మధ్య కొన్నాళ్ళుగా రేగుతున్న వైరానికి ఇది పరాకాష్ఠ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రజల్లో ఎలా ఉన్నా, పార్టీలో అంతర్గతంగా పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదనడానికి కొద్ది వారాలుగా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉదాహరణలు. మోదీ వ్యతిరేకతే అజెండాగా విపక్షాలన్ని టినీ ఒకతాటి మీదకు తీసుకురావాలని జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ, సొంత ఇంట్లోని లుకలుకలు ఆ పార్టీ అధిష్టానానికి నెత్తినొప్పిగా మారుతున్నాయి. నాలుగున్నరేళ్ళుగా తిరుగులేకుండా ఏలినచోట ఇలాంటి పరిస్థితి రావడం పార్టీ స్వయంకృతాపరాధమే. పాపులారిటీ ఉన్న సిద్ధూను బుజ్జగించడం కోసం, ముఖ్యమంత్రి వద్దన్నా సరే సరిగ్గా నెల క్రితం పీసీసీ పీఠమెక్కించింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రంలో విద్యుత్ అంశం, అవినీతి సహా అనేక అంశాలపై సిద్ధూ విమర్శలు ఎక్కుపెట్టినా, సహించి, భరించింది వారే. పీసీసీ పగ్గాలు తీసుకున్న వేదికపైనే, సీఎంపై అన్యాపదేశంగా విమర్శలు సంధించి మాజీ క్రికెటర్ సిద్ధూ తాను ‘టీమ్ ప్లేయర్’ని కానని నిరూపించుకున్నారు.
సరిహద్దు సమస్య, సాగు చట్టాలపై రైతు ఉద్యమం లాంటి అంశాలెన్నో పంజాబ్ ముందున్నాయి. కానీ, సిద్ధూ తన సలహాదారుల పేరిట కొత్తగా సమాంతర మంత్రివర్గం నడిపే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు అమరీందర్‌కు రాజకీయ కార్యదర్శిగా చేసి, ఇప్పుడు సిద్ధూకు సలహాదారైన మల్విందర్‌సింగ్ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఆ మాటలను అమరీందర్ సింగ్ వర్గం తీవ్రంగా తప్పుపట్టింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ బృందాన్ని ఆలీబాబా 40 దొంగలు అని మల్విందర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. సిద్ధూ మాత్రం పెదవి విప్పలేదు. పాకిస్తానీ మహిళా జర్నలిస్టుతో అమరీందర్ ఉన్న ఓ ప్రైవేట్ ఫోటోతో రచ్చ చేసినా కిమ్మనలేదు. చివరకు పంజాబ్‌లో ఇద్దరు సర్దార్ల మధ్య పోరు తారస్థాయికి చేరి, కెప్టెన్‌పై అంతర్గత తిరుగుబాటు రానున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ క్రమంలో అధిష్ఠానానికి జోక్యం చేసుకోక తప్పలేదు. 2022 ఎన్నికలకు ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యాన్ని మార్చే ప్రశ్నే లేదని అధిష్టానం వేగుల ద్వారా పంజాబ్ కాంగ్రెస్ వర్గాలకు.. మరీ ముఖ్యంగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఇబ్బందికరంగా మారిన ఎమ్మెల్యేలకు మెసెజ్ పంపారు. కానీ తిరుగుబాటు బృందం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమరీందర్ సింగ్‌కు మార్చే దాకా వదిలేది లేదంటూ.. ఆ బృందం సోనియా గాంధీని కలుస్తానంటోంది. ఈ పరిణామాలు ప్రతిపక్ష అకాలీదళ్‌లో, బీజేపీలో ఆశలు రేపుతున్నాయి. అంతా బాగానే వున్నా.. తమలో తాము కొట్టుకుని విపక్షానికి అవకాశమిచ్చే కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు ఎప్పుడు తెరపడుతుందా అని సగటు కాంగ్రెస్ కార్యకర్త ఎదురు చూస్తున్నాడు.