Punjab CM meet PM Modi: ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకున్నారు. శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి చేరుకున్న ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక, మొదటిసారిగా ప్రధానిని కలుస్తున్నందుకు గుర్తుగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ జ్ణాపికను ప్రధానికి చన్నీ అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య పంజాబ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు సీఎం చన్నీ తెలిపారు. అలాగే, గత కొన్ని రోజులుగా అన్నదాతల చేస్తున్న ఆందోళనకు కారణమైన వ్యవసాయ చట్టాలను సవరించాలని ప్రధానిని కోరినట్లు చన్నీ వెల్లడించారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు – ఎక్కువగా పంజాబ్, హర్యానా నుండి దాదాపు సంవత్సరంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానితో సమావేశం అనంతరం మీడియాతో సీఎం చన్నీ మాట్లాడుతూ ‘‘రైతులతో సంప్రదింపులు జరిపి ఆందోళన పరిష్కరించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరాను. అలాగే కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశాను. అలాగే కోవిడ్ మహమ్మారి కారణంగా మూసేసిన కర్తార్‌పూర్ కారిడాన్‌ను మళ్లీ తెరవాలని అభ్యర్థించాను’’ అని అన్నారు. అలాగే, అక్టోబర్ 1 నుండి 11 వరకు వరి సేకరణ ప్రారంభించడానికి తేదీని మార్చడంపై తన లేఖను ఉపసంహరించుకోవాలని సీఎం చన్నీ గురువారం కేంద్రాన్ని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి ఆలస్యం అయిన తర్వాత పంజాబ్, హర్యానాలలో ఖరీఫ్ వరి కొనుగోళ్లను అక్టోబర్ 11 వరకు వాయిదా వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పంటల సేకరణను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర సంస్థలతో కలిసి చేపడుతుంది.
ఇదిలావుంటే, ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో అనుహ్యంగా మారిన రాజకీయ పరిణామాల క్రమంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చరణ్‌జీత్‌సింగ్ చన్నీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభం తారాస్థాయికి చేరింది. మరోవైపు, రాష్ట్ర పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆ పదవి నుండి తప్పుకోవడంతో, ఢిల్లీ పర్యటనలో సీఎం చన్నీ కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా కలిసే అవకాశం ఉంది. మరోవైపు, పంజాబ్ ప్రభుత్వం ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునే ముందు సంప్రదింపుల కోసం కాంగ్రెస్ సమన్వయ ప్యానెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్యానెల్‌లో ఈ ఇద్దరు నాయకులతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి కూడా ఉంటారని సమాచారం.