Viral Video: బిల్డింగ్ పై నుండి వేలాడుతూ కనిపించిన నాలుగేళ్ల చిన్నారి.. ఇంతలో ఏం జరిగిందంటే?
ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు చిన్నపిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, తీవ్ర అనర్థాలకు అవకాశం ఉంటుందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఇది చూసైనా తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తుంది. ఓ భారీ భవనం పైనుండి ప్రమాదవశాత్తూ కిందికి పడిపోబోయిన చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగింది.. ఎక్కడ అనే పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పుణె నగరంలోని కాత్రాజ్ ప్రాంతంలో ఉన్న ఒక భారీ భవనంలో పెద్ద ప్రమాదం తప్పింది. బిల్డింగ్ మూడవ అంతస్తు కిటికీ నుంచి ఓ నాలుగేళ్ల చిన్నారి పడిపోవడానికి సిద్ధంగా ఉండగా, ఫైర్ బ్రిగేడ్ సకాలంలో స్పందించి ఆ చిన్నారి ప్రాణాలను రక్షించింది. ఆ సమయంలో ఆ చిన్నారి తల్లి తన మరో కూతురిని స్కూల్‌కు తీసుకెళ్లడానికి బయటికి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఈ చిన్నారిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లడమే ఈ ప్రమాదానికి దారి తీసింది. ఏమీ తెలియని వయసులో ఆ చిన్నారి.. తన తల్లి కనిపించక పోయేసరికి కిటికీ నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ వెళ్లే క్రమంలో కిటికీ చువ్వలను పట్టుకుని చాలాసేపు వేలాడుతూ ఉంది. కిటికీ నుంచి చిన్నారి వేలాడుతుండడం గమనించిన ఓ స్థానిక వ్యక్తి చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారు వచ్చి పరిశీలించగా, ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటివారు ఎవరూ సమయానికి లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వెంటనే ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి తలుపు బద్దలుకొట్టి చిన్నారిని కాపాడారు.
చుట్టుపక్కల వారు ఈ సంఘటనను గమనిస్తున్న సమయంలో వీడియో రికార్డు చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచిస్తూ నెటిజన్లు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. కాసేపట్లో వచ్చేయొచ్చులే, పక్కనే కదా ఇంతలో ఏం జరిగిపోతుంది అని ఆలోచించి, ఇలా పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లే ప్రతి తల్లిదండ్రికి ఈ ఘటన ఓ గుణపాఠంలా అనుకోవచ్చు. చిన్న ఆదమరపు పెద్ద ప్రమాదానికి దారితీసే ఇలాంటి సంఘటనల పట్ల ఇకనైనా ప్రతి ఒక్కరూ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో చూడండి..
మరిన్ని ట్రెండిగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
