Prime Minister Modi review : దేశంలో కరోనా పరిస్థితులతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖల పనితీరును రేపు ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించనున్నారు. ప్రధాని అధికారిక నివాసంలో బుధవారం సాయంత్రం వర్చువల్గా ఈ భేటీ ఉంటుంది. రోడ్డు, రవాణా, పౌర విమానయాన, టెలికం శాఖల పనితీరును మోదీ సమీక్షించనున్నారని సమాచారం. అలాగే కరోనాపై విస్తృత స్థాయిలో చర్చ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖల పనితీరును ప్రధాని సమీక్షించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి అవకాశం దొరుకుతుంది.. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్నదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన కేబినెల్ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారు అయ్యినట్లు రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నాయి.
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలు వరుస భేటీలతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. దీనిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కసరత్తు పూర్తి చేసినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు, సహాయ మంత్రుల పనితీరుపై రిపోర్ట్స్ తెప్పించుకున్నారు ప్రధాని మోదీ.
Read also : Govt Liquor shops : ఏపీలోని ప్రభుత్వ మద్యం షాపులలో వరుస దొంగతనాలు.. పలు అనుమానాలకు తావిస్తున్న వైనాలు