పేద పిల్లలను బడి బాట పట్టించడం కోసం మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాయి ప్రభుత్వాలు. దీంతో ఓ పూటైనా పిల్లల కడుపు నిండుతుందనే ఉద్ధేశ్యంతో తమ పిల్లలను సర్కారీ బడులకు పంపుతున్నారు తల్లిదండ్రులు. ఐతే కొన్ని ప్రాంతాల్లో పోషకాహారం కాదు కదా. కనీస భోజనం కూడా అందడం లేదు. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలు చూస్తే మధ్యాహ్న భోజన పథకం దుస్థితేంటో అర్థమవుతుంది.
పాలు, గుడ్డు, అరటిపండు దేవుడెరుగు. కనీసం కూర కూడా అందించడంలేదు నిర్వాహకులు. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రొట్టెలు, అన్నంతో పాటు కూరకు బదులుగా ఉప్పు ఇస్తున్నారు. ఐతే ఇదేమీ కొత్త కాదని..ఓ ఏడాది నుంచి ఇదే తంతు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఓ మీడియా సంస్థ కథనంతో వెలుగులోకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మేల్కొన్న అధికారులు విచారణ చేపట్టారు. బాధ్యులైనవారిని సస్పెండ్ చేశారు.
ఇక ఇటీవలే పశ్చిమబెంగాల్ చిన్సురాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. స్థానిక బాలికల పాఠశాలలో కూడా పిల్లలకు ఉప్పు, అన్నం మాత్రమే పెడుతున్న వీడియో వైరల్ అయింది. దీంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు