Droupadi Murmu: కేరళలో రాష్ట్రపతి హెలికాఫ్టర్‌కు ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా కుంగిన హెలిప్యాడ్..

కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. హెలిప్యాడ్‌పై దిగుతుండగా కాంక్రీట్‌లో ఇరుక్కుపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో ల్యాండింగ్ ప్రదేశం మారడంతో ఈ సంఘటన జరిగింది. వెంటనే సిబ్బంది హెలికాప్టర్‌ను బయటకు తీశారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుని అయ్యప్పను దర్శించుకున్నారు.

Droupadi Murmu: కేరళలో రాష్ట్రపతి హెలికాఫ్టర్‌కు ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా కుంగిన హెలిప్యాడ్..
President Droupadi Murmu's Chopper Stuck

Updated on: Oct 22, 2025 | 11:45 AM

శబరిమల అయ్యప్ప ఆలయ దర్శనం కోసం కేరళకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉదయం స్వల్ప ప్రమాదానికి గురైంది. కేరళలోని పతనంతిట్ట సమీపంలో ఉన్న ప్రమదం వద్ద ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం 9.05 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొత్తగా సిద్ధం చేసిన హెలిప్యాడ్‌పై సురక్షితంగా దిగింది. అయితే రాష్ట్రపతి దిగిన వెంటనే, ఆ హెలికాప్టర్ యొక్క టైర్లు కొత్తగా వేసిన కాంక్రీట్ ఉపరితలంలోకి కొద్దిగా కుంగిపోయాయి. ఈ స్వల్ప ప్రమాదం వల్ల ఎటువంటి ఆలస్యం లేకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో పంపాకు తన ప్రయాణాన్ని కొనసాగించారు.

చివరి నిమిషంలో ప్రణాళిక మార్పు

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రపతి విమానం రావడానికి కొద్ది గంటల ముందు మాత్రమే ప్రమదం ఇండోర్ స్టేడియంలో ఈ హెలిప్యాడ్ పనులు హడావుడిగా పూర్తయ్యాయి. వాస్తవానికి రాష్ట్రపతి నిలక్కల్‌లో దిగాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో ల్యాండింగ్ ప్రదేశాన్ని ప్రమదానికి మార్చారు. హెలికాప్టర్ ఇరుక్కుపోయిన తర్వాత, పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది వెంటనే స్పందించి, హెలికాప్టర్‌ను బయటకు నెట్టారు.

అయ్యప్ప దర్శనం కోసం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమల దర్శనానికి విచ్చేశారు. ప్రమాదం నేపథ్యంలో ఎటువంటి ఆలస్యం లేకుండా రాష్ట్రపతి రోడ్డు మార్గంలో పంపాకు వెళ్లారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి