Droupadi Murmu: మహిళలదే ఈ శకం.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ – రాష్ట్రపతి ముర్ము

గణతంత్ర దినోత్సవం వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం.. వికసిత్ భారత్ ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచింది. ఒకవైపు దేశ కుమార్తెలు క్రీడలు, అంతరిక్షం, రక్షణ రంగాల్లో సృష్టిస్తున్న రికార్డులను కొనియాడుతూనే.. మరోవైపు ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ మూడవ అతిపెద్ద శక్తిగా అవతరించబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Droupadi Murmu: మహిళలదే ఈ శకం.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ - రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu Republic Day Speech

Updated on: Jan 25, 2026 | 8:12 PM

భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, గత ఏడాది కాలంలో భారత్ సాధించిన అద్భుత విజయాలను ఆమె కొనియాడారు. ముఖ్యంగా దేశ ప్రగతిలో మహిళల పాత్రను, ఆర్థిక వృద్ధిని ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. జనవరి 26, 1950న మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గుర్తుచేసుకుంటూ, భారతదేశం బానిసత్వం నుండి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్రంగా ఆవిర్భవించిందని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే ఆదర్శాలే మన దేశ పునాదులని ఆమె తెలిపారు.

వందేమాతరం

వందేమాతరం గీత విశిష్టతను వివరిస్తూ.. బంకిం చంద్ర చటోపాధ్యాయ స్వరపరిచిన ఈ గీతం దేశ సాహిత్య జాతీయ ప్రార్థనగా మారిందని రాష్ట్రపతి అన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి ఈ గీతాన్ని ఎలా ప్రాచుర్యంలోకి తెచ్చారో గుర్తుచేశారు. అలాగే పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశభక్తిని, ఆయన నినాదం జై హింద్ స్ఫూర్తిని యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

రికార్డులు సృష్టిస్తున్న మహిళలు

దేశ అభివృద్ధికి సాధికారత కలిగిన మహిళలు అత్యంత అవసరమని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. 57 కోట్ల జన్ ధన్ ఖాతాలలో 56 శాతం మహిళలవేనని, 10 కోట్లకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాలు దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయని తెలిపారు. మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ ప్రపంచ కప్ గెలవడాన్ని, చదరంగంలో సాధించిన విజయాలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ చట్టం దేశంలోని మహిళలను మరింత శక్తివంతం చేస్తుందని, పంచాయతీ రాజ్ సంస్థల్లో ఇప్పటికే 46శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండటం గర్వకారణమని అన్నారు.

ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ

ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సేంద్రీయ వ్యవసాయం, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు దేశ భవిష్యత్తుకు కీలక స్తంభాలని ఆమె అభివర్ణించారు.

అందరి సహకారం.. దేశ ప్రగతికి సోపానం

దేశ సరిహద్దులను కాపాడే సైనికులు, అంతర్గత భద్రతను పర్యవేక్షించే పోలీసులు, ఆహారాన్ని అందించే రైతులు, పౌరుల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించే వైద్యులు, నర్సుల సేవలను రాష్ట్రపతి కొనియాడారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారని ప్రశంసించారు. స్వావలంబన, ప్రగతిశీల భారతదేశం కోసం మనమందరం ఐక్యతతో, సమిష్టి సంకల్పంతో పనిచేయాలి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.